ఆఖరి దశ ఎన్నికల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రం పంజాబ్. ఆ రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఒకేదఫాలో పోలింగ్ జరగనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఇండీ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో మాత్రం ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నాయి.
పంజాబ్‌లో 1996 నుంచీ బీజేపీ-శిరోమణి అకాలీదళ్ పార్టీల మధ్య స్నేహం ఉంది. అకాలీదళ్ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. 2019లో గద్దెనెక్కిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలోనూ ఎస్ఎడి భాగస్వామిగా ఉంది. 2020 సెప్టెంబర్‌లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగింది. పంజాబ్ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమానికి మద్దతిచ్చింది. శిరోమణి అకాలీదళ్ బీజేపీ మధ్య బంధం తెగిపోవడంతో ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 13 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది.
ఈ పరిణామం బీజేపీ మంచికేనంటున్నారు పరిశీలకులు. పంజాబ్‌లో బీజేపీ ఎప్పుడూ అకాలీదళ్ తర్వాతి స్థానంలోనే ఉండేది. ప్రకాష్ సింగ్ బాదల్ జీవించి ఉన్నంతకాలం కమలం పార్టీ ఒదిగే ఉండేది. కేవలం 3 ఎంపీ, 23 అసెంబ్లీ సీట్లతో సర్దుకుపోయేది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ప్రకాష్‌సింగ్ బాదల్ నియంత్రించారు. ఆఖరికి మునిసిపల్ ఎన్నికల్లో సైతం వారు కలిసే పోటీ చేసేవారు.
బీజేపీకి రాష్ట్రంలోని వాణిజ్య వర్గాల్లో కొంత బలమైన పట్టే ఉంది. నగర ప్రాంతాల్లోని ఓటర్లు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. లూధియానా, అమృత్సర్, చండీగఢ్, హోషియార్పూర్, గురుదాస్‌పూర్ నియోజకవర్గాల్లో బీజేపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అకాలీదళ్‌తో పొత్తు కారణంగా పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఎదగలేకపోయింది. ఇక రైతు చట్టాలపై వ్యతిరేకత పంజాబ్‌లోనే ఎక్కువ ఉండడమూ ఆ పార్టీకి ఇబ్బందికరమే. అయితే బీజేపీ దృష్టి కేవలం ఎంపీ స్థానాల మీద లేదు. 2027లో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడానికే బీజేపీ సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అది ఎంతవరకూ సాధ్యమో ఈ ఎన్నికల్లో తెలుస్తుంది.
శిరోమణి అకాలీదళ్ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిని ఉంది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి బీజేపీ మద్దతునూ కోల్పోయింది. ఈసారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న అకాలీదళ్, పంజాబీ సెంటిమెంటును ఉపయోగిస్తోంది. ‘పంజాబ్ పంజాబీలకు మాత్రమే’ అన్న నినాదంతో పోటీ చేస్తోంది. మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ మద్దతు లేకుండా బరిలోకి దిగింది.
ఇక భారత జాతీయ అభివృద్ధి సమీకృత కూటమి (భాజాఅసకూ – ఇండీ కూటమి) భాగస్వాములైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ పంజాబ్‌లో మాత్రం పరస్పరం పోటీపడుతున్నాయి. పంజాబ్ శాసనసభలో అధికారంలో ఉన్న ఆప్, తన ఆధిక్యాన్ని ఏమాత్రం వదులుకోడానికి సిద్ధంగా లేదు. అయితే రాష్ట్రంలో రెండున్నరేళ్ళ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేకపోవడం ఆప్‌కు మైనస్ పాయింట్. ఎన్నో వాగ్దానాలు చేసినా వాటిని అమల్లోకి తేకపోవడంపై పంజాబీలు, ప్రత్యేకించి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహిళలకు నెలకు రూ.1000 ఇస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినా, రెండేళ్ళు దాటిపోయినా ఆ పథకం ప్రారంభించకపోవడం పెద్ద దెబ్బ.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతే తనకు కలిసివస్తుందని భావిస్తోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ రెండు పార్టీల మీదా వ్యతిరేకత ఉందని, వారి వ్యతిరేక ఓటు తమకే పడుతుందనీ అంచనా వేస్తోంది. మూడు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబీ రైతులు చేసిన పోరాటానికి మద్దతివ్వడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశపడుతోంది.
ఇండీ కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం కూడా ఇక్కడ పోటీ చేస్తున్నాయి. ఆ కూటమిలోని కాంగ్రెస్, ఆప్ పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు సైతం బరిలో నిలిచాయి. ఇక ఆ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు తన ఓటుశాతం తగ్గిపోతూనే ఉన్నప్పటికీ అక్కడి ఎస్సీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని ఆశగా ఉంది.