ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 111 స్థానాల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తామని వివరించారు.
దిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్స సందర్భంగా సీఈవో మీనా మాట్లాడుతూ.. ‘సమస్యాత్మక జిల్లాల్లో లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ను అమలుచేసి, సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తామన్నారు.
.
111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లులో ఫలితాలు తేలనుండగా, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లుకు లెక్క తేలుతుంది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25కు పైగా రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.
ఫలితాల అనంతరం అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశామని రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి శంఖబ్రత బాగ్చి తెలిపారు.
ఓట్ల లెక్కింపు పూర్తికాగానే ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫాం-21సి, ఫాం-21ఇలను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించారు.