నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరం తాకనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాలు ఇవాళ సాయంత్రానికి లక్షద్వీప్, మలబార్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. జూన్ 4 నాటికి తెలంగాణ, ఏపీలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా ప్రకటించింది.
మరోవైపు దేశంలో ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఏడు గంటలకే బుధవారంనాడు విశాఖలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే నాలుగు రోజులు ఎండలు మండే అవకాశముందని ఐఎండి తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా బుధవారం నాడు 52.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర కోస్తాలో ఎండలు కాస్త తక్కువగానే ఉన్నా, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారంనాడు రాయలసీమ, నెల్లూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.