దిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దిల్లీలోని ముంగేష్ పుర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం దిల్లీలోని వాతావరణ పరిస్థితులకు తోడు రాజస్థాన్ నుంచి వీస్తున్న వడగాలులు వల్ల వాతావరణంలో పెనుమార్పులు ఏర్పడ్డాయని వాతావరణం విభాగం ప్రాంతీయ అధికారి కుల్దీప్ శ్రీవాత్సవ తెలిపారు.
ముఖ్యంగా రాజస్థాన్ వైపు నుంచి వీస్తున్న వడగాలులతో దిల్లీ శివారు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వివరించారు. సాధారణం కంటే 9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో దిల్లీ వాసులు అల్లాడుతున్నారు. 2002 లో అత్యధిక ఉష్ణోగ్రత 49.2 డిగ్రీలు నమోదైంది.
నేటి(బుధవారం) సాయంత్రం వర్షం పడటంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. దీంతో వాతావరణంలో తేమ శాతం పెరిగింది. దిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడకం పెంచారు. దీంతో దేశరాజధానిలో 8, 302 మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన రాజస్థాన్ లో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హర్యానాలో 50.3 డిగ్రీలుగా రికార్డు అయింది.