కర్ణాటకలోని మంగళూరు నగరంలో రహదారులపై ముస్లిములు నమాజ్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. కన్నడరాష్ట్రంలోని కోస్తా ప్రాంతం అంతటినుంచీ ఆ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చర్యను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ముస్లిములు అలాంటి చర్యలను కొనసాగిస్తే తగిన ప్రతిచర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది.
గత శుక్రవారం, అంటే మే 24న మంగళూరు నగరంలోని కంకనాడి ప్రాంతంలో ఒక వీడియో వైరల్ అయింది. పలువురు ముస్లిములు రోడ్డు మీద నమాజ్ చేసారు. దానివల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ప్రజలకు అసౌకర్యం కలిగింది, చాలామంది తమ వాహనాలను వెనక్కు మళ్ళించుకుని వేరే దారుల్లోంచి వెళ్ళాల్సి వచ్చింది. బహిరంగ ప్రదేశంలో నమాజ్ అనే మతపరమైన కార్యక్రమాన్ని చేపట్టడంపై హిందూసంస్థలు తీవ్రంగా స్పందించాయి. దాంతో ఆ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆ ఘటనకు స్పందనగా మంగళూరు ఈస్ట్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై సుమోటో కేసు నమోదు చేసారు. రోడ్డుపై నమాజు చేయడం ద్వారా వాహనాలకు అంతరాయం కలిగించడం, ట్రాఫిక్ సమస్యలకు కారణమవడం, ప్రజారవాణాను అడ్డుకోడానికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ధ్రువీకరించారు.
ఆ ఘటనపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే నగరంలో శాంతికి భంగం కలిగించే లక్ష్యంతోనే రోడ్డుపై నమాజ్ చేసారని విహెచ్‌పి దక్షిణ ప్రాంత సంయుక్త కార్యదర్శి శరణ్ పంప్‌వెల్ మండిపడ్డారు. ఆ ఘటనపై జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అటువంటి సంఘటనలు మళ్ళీ జరిగితే ఊరుకోబోమని, భారీ సంఖ్యలో హిందువులను సమీకరించి హనుమాన్ చాలీసా పారాయణలు చేపడతామని వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చట్టాలు, విధానాల ఉల్లంఘన ఎక్కువైపోయిందని దక్షిణ కన్నడ ప్రాంత ఎంపీ నళిన్ కుమార్ కతీల్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగుతోందని విమర్శించారు.