1999లో భారతదేశంతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆ దేశపు మాజీ ప్రధానమంత్రి, పిఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ అంగీకరించారు. పాకిస్తాన్ అణుపరీక్షలు చేసి 26 సంవత్సరాలు అయిన సందర్భంలో మంగళవారం, మే 28న నవాజ్ షరీఫ్ మాట్లాడారు. తమ దేశమే లాహోర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించి భారతదేశంతో యుద్ధం చేసిందనీ ఆయన ఒప్పుకున్నారు.
లాహోర్ డిక్లరేషన్ మీద 1999లో నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకాలు చేసారు. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ దుందుడుకు చర్య అయిన కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్ తప్పిదమని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.
‘‘1988 మే 28న పాకిస్తాన్ ఐదు అణు పరీక్షలు చేసింది. దాని తర్వాత వాజ్‌పేయీ సాహెబ్ మన దేశానికి వచ్చారు. మనతో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది మన తప్పు’’ అని నవాజ్ షరీఫ్ తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు.
భారత పాకిస్తాన్ దేశాలు 1999 ఫిబ్రవరి 21న కుదుర్చుకున్న ఒప్పందమే లాహోర్ డిక్లరేషన్. ఇరు దేశాల మధ్యా శాంతిభద్రతలు నెలకొల్పడం, ఇరుదేశాల ప్రజల మధ్యా సత్సంబంధాలు నెలకొల్పడం దాని లక్ష్యాలు. అయితే కొద్ది నెలలకే పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్‌పై యుద్ధం ప్రకటించింది. అదే కార్గిల్ యుద్ధం.
1999లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ భారతదేశపు లద్దాఖ్ ప్రాంతంలోని కార్గిల్ జిల్లాలోకి రహస్యంగా చొరబడాలని ఆదేశించాడు. ఫలితంగా ఇరుదేశాల మధ్యా పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. ఆ కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది.