సుప్రీంకోర్టులో ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ను పొడిగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ ను లిస్టింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నందున ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని తెలిపింది.
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్ ను మార్చి 21 న ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జాప్యం అవుతుండటంతో ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కు అభ్యర్థించగా కోర్టు అనుమతించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.
తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందును బెయిల్ ను మరో ఏడు రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా కోర్టు నిరాకరించింది. అంతకు ముందు అత్యవసరంగా విచారించాలంటూ పిటిషన్ వేయగా కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో మరోసారి కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ కు లిస్టింగ్ అర్హత లేదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తేల్చి చెప్పింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళే స్వేచ్ఛ ఉందని గుర్తు చేసింది.