భారతదేశపు తూర్పు, దక్షిణ భాగాల్లోని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి గరిష్ఠ స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అంచనా వేసారు. లోక్‌సభ ఎన్నికల ఆఖరి దశకు ముందు ఒక జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసారు.
‘‘బెంగాల్లోనూ మేం గణనీయమైన స్థానాలు సాధిస్తాం. మొత్తం 42 ఎంపీ సీట్లలో మేం 24నుంచి 30 సీట్ల వరకూ గెలిచే అవకాశాలున్నాయి. ఒడిషాలో మా లక్ష్యం మొత్తం 21 ఎంపీ సీట్లలో 17 స్థానాలు. అలాగే ఒడిషా అసెంబ్లీలోని 147 స్థానాల్లో 75 స్థానాలు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో బీజేపీ సుమారు 10 స్థానాలు గెలుచుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. అలాగే అక్కడి 25 ఎంపీ సీట్లలోనూ ఎన్‌డిఎ కూటమి గరిష్ఠ స్థానాలను దక్కించుకుంటుంది’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
బీజేపీ ఇప్పటికే దేశంలోని ఉత్తర, పశ్చిమ భాగాల్లో పటిష్టంగా ఉంది. తూర్పు రాష్ట్రాలు, దక్షిణాదిలో ఎలాగైనా ఈ ఎన్నికల్లో అడుగు మోపాలని పట్టుదలగా ఉంది. తూర్పున, దక్షిణాన చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నాయి. ఈసారి ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిషాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఆంధ్రాలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అధికార వైఎస్ఆర్సిపికి గట్టిపోటీ ఇస్తోంది.
‘‘బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒడిషాలతో కూడిన తూర్పు భారతంలోనే కాదు… కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులతో కూడిన దక్షిణాదిలోనూ మేము అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
శనివారం నాటి ఆఖరిదైన ఏడవ దశ పోలింగ్‌లో 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో 26స్థానాలు ఒడిషా, బెంగాల్, బిహార్‌లో ఉన్నాయి.