కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చైనాపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. 1962లో ఆ దేశం భారత్‌పై చేసింది యుద్ధం కాదట. చైనా భారత్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు మాత్రం వచ్చాయట. అంటే మణిశంకర్ అయ్యర్ మాటల ప్రకారం చూస్తే పాపం చైనా మనదేశంతో యుద్ధం చేసిందని, మన సైనికులు వారిని నిలువరించే ప్రయత్నం చేసారనీ, ఆ సమయంలో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందనీ చెప్పేవన్నీ అబద్ధాలన్నమాట.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ ‘‘1962 అక్టోబర్‌లో చైనా భారత్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు వచ్చాయి’’ అని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఆయన తర్వాత క్షమాపణలు చెప్పారు. ‘చైనీయుల చొరబాటు’ అన్న పదానికి ముందు ‘ఆరోపణలు’ అన్న పదం వాడడం తాను చేసిన తప్పు అని, దానికి క్షమాపణలు చెబుతున్నాననీ అయ్యర్ వెల్లడించారు. అయ్యర్ వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ మీద విరుచుకుపడింది.
‘‘ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అవకాశాన్ని నెహ్రూ చైనా కోసం వదిలిపెట్టేసారు. రాహుల్ గాంధీ చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ చైనా ఎంబసీ నుంచి నిధులను స్వీకరించి, చైనా కంపెనీలను భారతీయ మార్కెట్లోకి అనుమతించాలంటూ వ్యాసాలు ప్రచురించింది. వాటి ఆధారంగా సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చైనా వస్తువులకు భారత్‌లోకి గేట్లు ఎత్తేసింది. దానివల్ల దేశీయ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. ఇంక ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ 1962లో చైనా అసలు భారత్‌పై యుద్ధమే చేయలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ యుద్ధం సమయంలోనే చైనా మన దేశానికి చెందిన 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అన్యాయంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించింది’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో కాంగ్రెస్ ఆయన ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదంటూ దూరం జరిగే ప్రయత్నం చేసింది.
‘‘మణిశంకర్ అయ్యర్ ‘చొరబాటు ఆరోపణ’ అనే పదాన్ని వాడినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. ఆయన మాటలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. 1962 అక్టోబర్ 20న చైనా భారత్‌లోకి చొరబడడం నిజం. అలాగే, మే 2020లోనూ చైనా లద్దాఖ్ వద్ద భారత్‌లోకి చొరబడింది. ఆ ఘటనలో 20మంది భారతీయ సైనికులు చనిపోయిన మాట కూడా నిజమే’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేసారు.
మణిశంకర్ అయ్యర్‌కు వివాదాలు కొత్తకాదు. ఈ నెల మొదట్లో ఆయన పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో ఆయన ‘పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది కాబట్టి ఆ దేశానికి భారత్ గౌరవం ఇవ్వాలి. లేదంటే వారు మనదేశం మీద అణుబాంబు ప్రయోగిస్తారు’ అని చెప్పడం వివాదాస్పదమైంది.