లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరగనుంది. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ సెంటర్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు.
సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని సూచించారు.