ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, సత్యశోధకుడిగా (ఫ్యాక్ట్ చెకర్)గా తనకు తానే చెప్పుకునే మహమ్మద్ జుబేర్ మరోసారి అబద్ధాలాడుతూ పోలీసులకు దొరికిపోయారు. గతంలో చాలాసార్లు తప్పుడు లేదా నకిలీ వార్తలు (ఫేక్ న్యూస్) వ్యాపింపజేస్తూ పట్టుబడిన జుబేర్, ఈసారి ఉత్తరాఖండ్ పోలీసుల చేతికి చిక్కాడు.
నిన్న (సోమవారం) జుబేర్ తన ఎక్స్ ఖాతాలో ఒక వార్తాకథనం గురించి పోస్ట్ చేసాడు. కురాన్‌ను తగులబెట్టేసారంటూ ముస్లిములను రెచ్చగొట్టే కథనాన్ని షేర్ చేసాడు. ఆ పోస్ట్‌లో అతను ఇలా రాసుకొచ్చాడు ‘‘ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. రూర్కీ నగరానికి చెందిన యూట్యూబర్ ఒకరు కురాన్‌ను తగులబెట్టి ధ్వంసం చేస్తున్నట్లుగా ఉంది. రూర్కీ పోలీసులు అత్యవసరంగా ఆ విషయాన్ని పరిశీలించాలి’’ అని రాసుకొచ్చాడు.
విచిత్రమేంటంటే సత్యశోధకుడిని అని తనకు తనే చెప్పుకునే ఈ ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్, ఈ వార్తకు ఆధారం ఏమీ చూపించలేదు. ఆ వీడియోను కూడా షేర్ చేయలేదు. ఆ సమాచారం ఎంతవరకూ సరైనదో కాదో అని పరిశీలించలేదు. ఈసారికి ఆ బాధ్యతను మాత్రం పోలీసులకు వదిలేసాడు.
‘ఫ్యాక్ట్ చెకర్’ని అని చెప్పుకునే వ్యక్తి, తాను ఎలాంటి ఫ్యాక్ట్ చెకింగూ చేయకుండా అలాంటి సున్నితమైన అంశం మీద ప్రజలను, ప్రత్యేకించి ముస్లిములను పక్కదోవ పట్టించేలాంటి వార్తను ప్రచురించాడు. దాన్ని చూసినవారు అది నిజమని నమ్మేలా వారిని పక్కదోవ పట్టించేలా తెలివిగా ఆ నాలుగు వాక్యాలూ రాసుకొచ్చాడు. అంతేకాదు, తను షేర్ చేయని వీడియో గురించి ఏ సమాచారమూ ఇవ్వలేదు. అసలా వీడియో ఎక్కడిది, ఎప్పటిది, ఏ ఊరికి సంబంధించినది, అతను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరు, అతని వివరాలేమిటి… అలాంటివి ఏమీ చెప్పకుండా తెలివిగా ఒక ఆరోపణ చేసి వదిలేసాడు. ముస్లిములను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. ఆ ట్వీట్ చూసిన ముస్లిములు రెచ్చిపోయి హిందువులపై దాడులు చేయాలనేది అతని ఉద్దేశమని అర్ధమవుతోంది.
హరిద్వార్ పోలీసులు వెంటనే జుబేర్ ట్వీట్‌కు స్పందించారు. ‘‘మీరు పేర్కొన్న కేసులో మాజీ ముస్లిం సమీర్ పడ్లీ గుర్జర్ అనే ప్రాంతంలో దాదాపు మూడేళ్ళనుంచీ నివసించడం లేదు. ఇక హరిద్వార్ జిల్లాలో ఏ ప్రాంతంలోనూ కురాన్‌ను ధ్వంసం చేసిన ఘటనలేవీ జరగలేదు. కాబట్టి సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను వ్యాపింపజేయవద్దు. లేనిపక్షంలో మీమీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది. ధన్యవాదాలు’’ అంటూ హరిద్వార్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసారు.
పోలీసుల వివరణ తర్వాత ప్రజలు జుబేర్ ఉద్దేశాలపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. అతని మీద చర్య తీసుకోవలసిందిగా పోలీసులను కోరారు.
‘‘అలాంటి సంఘటన ఏదీ జరగలేదని పోలీసులు చెబుతున్నారు. నువ్వు అసలు నిజాలను ఎందుకు పరిశీలించలేదు? పోలీసు వివరణ తీసుకోకుండా అసలు పోస్ట్ ఎందుకు పెట్టావు? మరే ఇతర సందర్భంలోనైనా నువ్వు ఎప్పుడూ చేసేటట్టు ఈ ఘటన విషయంలో ఉత్తరాఖండ్ పోలీసులను ఎందుకు సంప్రదించలేదు? ఎందుకు వారి వివరణ తీసుకోలేదు? ఉత్తరాఖండ్ పోలీసులకు విజ్ఞప్తి. ఈ పోస్టును గమనించండి. జుబేర్ అనే పేరున్న వ్యక్తి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం ద్వారా మతఘర్షణలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అంటూ ఒక వ్యక్తి ఆ పోస్ట్ కింద కామెంట్ చేసారు.
ఇటువంటి వార్తల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు గణనీయంగా జరుగుతున్నాయి. జుబేర్ గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మీద ఇలాగే ఎడిటెడ్ వీడియోక్లిప్ విడుదల చేసాడు. ఆ తర్వాత, తల తరిగేస్తామంటూ ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ సంఘటన దేశంలో అతివాద హింసాకాండకు దారితీసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యాలాల్‌ను ముస్లిం అతివాదులు నరికి చంపారు.
జుబేర్ ఇలా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ జుబేర్ తప్పుడు వార్తలు ప్రచారం చేసిన కనీసం 60 సంఘటనలు నమోదై ఉన్నాయి.