దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడానికి ప్రతిపక్షాలు, ప్రత్యేకించి ఇండీ కూటమి ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను రక్షించవలసిన అవసరం ఉందన్నారు.
ఎఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు. బడుగు బలహీనవర్గాల హక్కులను, రాజ్యంగ నియమాలను పరిరక్షించడం తమ కర్తవ్యమన్నారు.
‘‘ఎస్సీ ఎస్టీ ఓబీసీ తరగతుల ప్రజలను చీకట్లో ఉంచి వారిని దోచుకుంటున్నారు. ఈ ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు, వారికి పొంచివున్న పెద్ద ముప్పు గురించి జాగ్రత్త చెప్పడం నా బాధ్యత. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను. ఇండీ కూటమి పక్షాలు తమ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం భారత రాజ్యాంగపు మౌలిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. దళితులు, గిరిజనుల మంచి కోరుకునేవారమని చెప్పుకుంటున్నవారు నిజానికి ఆ వర్గాలకు ప్రబల శత్రువులుగా ఉన్నారు. వారి మ్యానిఫెస్టో ముస్లింలీగ్ నకలులా ఉంది. వారి ఓటుబ్యాంకు కోసం మీ రాబోయే తరాల భవిష్యత్తును నాశనం చేస్తారా? దళిత, గిరిజన, ఓబీసీ సోదర సోదరీమణుల హక్కుల కోసం నేను పోరాడుతున్నాను’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
‘‘వాళ్ళు విద్యాసంస్థలను మైనారిటీ సంస్థలుగా మార్చి, తద్వారా రిజర్వేషన్లను తొలగించేస్తున్నారు. ఉదాహరణకి ఢిల్లీలో జామియా మిలియా విశ్వవిద్యాలయానికి మైనారిటీ సంస్థగా గుర్తింపు ఇచ్చారు. ఇప్పుడా యూనివర్సిటీలో అడ్మిషన్లలోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు లేవు. అలా దేశంలో సుమారు 10వేల విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు హక్కుగా రావలసిన రిజర్వేషన్లను తొలగించేసారు’’ అని మోదీ వివరించారు. కేవలం తమ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు అందకుండా చేసారని మండిపడ్డారు.
కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టో విడుదల చేసాక రిజర్వేషన్లపై వారి వైఖరి బట్టబయలైందనీ, అది తనకు ఆందోళన కలిగిస్తోందనీ మోదీ అన్నారు. ‘‘ఏప్రిల్ 5న కాంగ్రెస్ విడుదల చేసిన తమ మ్యానిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితిని 50శాతం నుంచి పెంచుతామని ప్రస్తావించింది. వారి మ్యానిఫెస్టోను నేను తొలుత చూసినప్పుడు అది అచ్చం ముస్లింలీగ్‌కు నకలులా ఉందనిపించింది. నేను ఆ మాట చెప్పిన రెండుమూడు రోజులు వాళ్ళేమీ స్పందించలేదు. అప్పుడు నేనున ఒక్కొక్కటిగా అన్నీ బైటపెట్టాను. ఉదాహరణకు, మన దేశంలో క్రీడల్లో కూడా మైనారిటీలకు కోటా ఇస్తామని వారు చెబుతున్నారు. ఇవాళ మన పంజాబ్ పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారు. బెంగాల్ యువత ఫుట్‌బాల్ బాగా ఆడుతున్నారు. ఉత్తరప్రదేశ్ యువజనులు అథ్లెటిక్స్‌లో అద్భుతాలు సాధిస్తున్నారు. వారందరూ ప్రతీరోజూ ఉదయం 4గంటలకు లేచి ఎంతో శ్రమిస్తారు. అలాంటి చోట మైనారిటీలకు ప్రవేశం కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అదే జరిగితే ఇంత శ్రమపడిన యువతరం ఏమైపోతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి?’’ అని మోదీ ప్రశ్నించారు.
ప్రభుత్వ టెండర్లలోనూ మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఒక ముఖ్యమైన బ్రిడ్జి కట్టడానికి కాంట్రాక్టు కంపెనీ అత్యుత్తమ పనితీరు, వనరులు, సామర్థ్యాలు, అర్హతలూ చూసి ఇవ్వాలి తప్ప రిజర్వేషన్ ప్రాతిపదికన ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు.
‘‘ఇవాళ ఒక ముఖ్యమైన బ్రిడ్జి కడుతున్నారనుకోండి? వారిని ఎలా ఎంచుకుంటారు? వారి పనితీరు బాగుండాలి, వారివద్ద వనరులు పుష్కలంగా ఉండాలి. పని చేయడానికి సామర్థ్యం ఉండాలి. ఆ పని చేయగలగాలి. ఆ అన్ని అవసరాలనూ తీర్చగలిగినవాడికే పని ఇస్తాం కదా. అక్కడ పోటీ ఎక్కువ ఉంది. ఆ పోటీలో గెలిచేవారికే టెండర్ దక్కుతుంది కదా. కానీ వారు అలా చెప్పరు. ఇవన్నీ మెల్లమెల్లగా జరిగిపోతాయి. ఇలాగే కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తే నిర్మాణం పనుల్లో లోపాల వల్ల జనాలు చనిపోతే దానికి బాధ్యులెవరు? కేవలం ఓటుబ్యాంకు కోసం భవిష్యత్ తరాలు ధ్వంసమైపోవాలా? కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇవి కొన్ని అంశాలు మాత్రమే. అందుకే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరుల హక్కులను రక్షించడం నా బాధ్యత’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఇటీవల కలకత్తా హైకోర్టు ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేసిన సంగతినీ మోదీ గుర్తు చేసారు. ‘‘వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది. మొదట వారు ఆంధ్రప్రదేశ్‌లో చట్టం చేసి ఇతరుల రిజర్వేషన్లను మైనారిటీలకు ఇవ్వడం అనే పాపం చేయడం మొదలుపెట్టారు. అయితే రాజ్యాంగం దానికి ఒప్పుకోదు. అందుకే వారు సుప్రీంకోర్టులో ఓడిపోయారు. అందుకే హైకోర్టు కూడా ఆ పద్ధతిని తిరస్కరించింది. వాళ్ళిప్పుడు తెలివిగా వెనుకవైపు నుంచి ఆట మొదలుపెట్టారు. రాత్రికి రాత్రి ముస్లిముల కులాలను ఓబీసీలుగా చేసేసారు. అలా అసలైన ఓబీసీల హక్కులను దోచుకున్నారు’’ అని మోదీ వివరించారు.
‘‘హైకోర్టు తీర్పు వచ్చాకనే ఎంత పెద్ద మోసం జరుగుతోందో స్పష్టంగా తెలిసింది. అయితే తమ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వారిప్పుడు న్యాయవ్యవస్థనే నిందిస్తున్నారు. కోర్టు చెప్పినదాన్ని వినబోమని కుండబద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని మోదీ చెప్పారు.