మద్యం సేవించి అంత్యంత వేగంగా లగ్జరీ కారుతో ఢీ కొట్టి ఇద్దరు సాఫ్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన 17 సంవత్సరాల బాలుడి కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాద సమయంలో బాలుడు మద్యం సేవించి ఉన్నాడని రుజువు చేయడానికి పుణె పోలీసులు అతని రక్తం శాంపిల్స్ తీసుకుని సరూన్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ బాలుడి రక్తనమూనాలను మార్చి వేసేందుకు రూ.3 లక్షల లంచం తీసుకున్న వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బాలుడి తండ్రి నుంచి లంచం వసూలు చేసి డాక్టర్లకు ముట్టజెప్పేందుకు ఆసుపత్రి ప్యూన్ రూ.3 లక్షలు తీసుకున్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆసుపత్రి బంట్రోతు అతుల్ గట్ కాంబ్లీని పుణె నేర విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలుడి రక్త నమూనాలను చెత్తబుట్టలో పడేసి, వాటి స్థానంలో డాక్టర్ రక్త నమూనాలను ఉంచిన కేసులో డాక్టర్ అజయ్ తవాడీ, డాక్టర్ హరి హర్నూర్‌లను పుణె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆసుపత్రి ప్యూన్ కాంబ్లీని అరెస్ట్ చేశారు.