కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లకు పాకిస్తాన్ ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుండడంపై దర్యాప్తు జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ఇంటర్‌వ్యూలో అడిగిన ప్రశ్నకు జవాబుగా అది చాలా తీవ్రమైన విషయమని మోదీ వ్యాఖ్యానించారు. తాను ఉన్న స్థాయిలో అటువంటి అంశాలపై స్పందించకూడదని, అయితే ఆ విషయంలో ఆందోళనలను అర్ధం చేసుకోగలననీ మోదీ చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల ఆరోదశలో ఢిల్లీలో పోలింగ్ జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లను పాకిస్తాన్ మాజీ మంత్రి చౌధురీ ఫవాద్ హుసేన్ ప్రశంసించారు. దాని గురించి మోదీని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ‘‘ఎందుకో తెలియదు కానీ మన దేశంతో శత్రుత్వం ఉన్నవారు మన దేశంలోని కొంతమందిని మాత్రం ఇష్టపడతారు. వారికి అనుకూలంగా ఎలుగెత్తి మాట్లాడుతుంటారు.’’
అది ఆందోళన కలిగించే విషయమేనని ప్రధాని ఒప్పుకున్నారు. అయితే భారతీయ ఓటర్లు పరిపక్వత కలిగిన వారనీ, సరిహద్దులకు ఆవలినుంచి వచ్చే ప్రకటనలు భారత్‌లో ఎన్నికలపై ప్రభావం చూపలేవనీ మోదీ అభిప్రాయపడ్డారు.
చౌధురీ ఫవాద్ హుసేన్, ఇమ్రాన్‌ఖాన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన ‘ఎక్స్’లో థంబ్స్ అప్ ఎమోజీ పెట్టారు. ‘మోదీ మరో యుద్ధం ఓడిపోయారు. కేజ్రీవాల్ విడుదాల అయ్యారు. భారతదేశానికి మంచివార్త’ అని ట్వీట్ చేసారు.
ఆ తర్వాత కేజ్రీవాల్, ఆయన కుటుంబం పోలింగ్‌బూత్ దగ్గర ఉన్న ఫొటోని పోస్ట్ చేసారు. ఆ ట్వీట్‌కి ‘ద్వేష, అతివాద శక్తులను శాంతి సౌహార్దాలు ఓడించాలి’ అని వ్యాఖ్య జతపరిచారు.
దానికి కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘చౌధురీ సాహెబ్, నేనూ నా దేశ ప్రజలూ మా సొంత సమస్యలను పరిష్కరించుకోగలం. మాకు మీ ట్వీట్ అక్కరలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. మీ సంగతి మీరు చూసుకోండి’ అని కేజ్రీవాల్ జవాబిచ్చారు.
అంతకుముందు రాహుల్ గాంధీకి చౌధురి మద్దతు ప్రకటించడం రాజకీయ సంచలనం సృష్టించింది. రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు ఆ విషయంలో కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.