ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగు చూసింది. పదహారేళ్ళ దళిత మైనర్ బాలికను తుపాకితో బెదిరించి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ ఘాతుకానికి ఒడిగట్టినవాళ్ళు నలుగురూ ముస్లిములే. అందులో రషీద్ ప్రధాన నిందితుడు కాగా మిగతా ముగ్గురిలో అతని తండ్రి కూడా ఉండడం గమనార్హం.
బాలికను రక్షించుకోడానికి ఆమె కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు నిందితులు వారిని కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటన మే 20న బరేలీ జిల్లా దేవరాణియా పీఎస్ పరిధిలోజరిగింది. బాధితురాలి తండ్రి మే 22న పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… మే 20న బాధితురాలి కుటుంబంలో ఒక వేడుక జరిగింది. ఆ రాత్రి బాధితురాలు తమ ఇంటినుంచి బంధువుల ఇంటికి వెడుతోంది. దారిలో రషీద్ ఆమెను చూసాడు. తుపాకితో ఆమెను బెదిరించి పక్కనున్న తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెను లైంగికంగా వేధించాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు. అతను తన స్నేహితులైన అష్ఫాక్, నానే అనే ఇద్దరిని అక్కడికి పిలిచాడు. అంతలో అక్కడికి రషీద్ తండ్రి నన్హే కూడా చేరుకున్నాడు. అతను బాధితురాలిని వీలైనంత దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలంటూ తన కొడుక్కి చెప్పాడు.
బాలిక ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి బంధువులు ఆమె కోసం వెతకనారంభించారు. వారిలో కొందరు ఊరి పక్కనున్న అడవి దగ్గర కూడా వెతికారు. రషీద్, ఇతర నిందితులు ఆమెను వేరేచోటకు తరలించేలోగానే బంధువులు అక్కడకు చేరుకోగలిగారు. వారిని చూడగానే రషీద్, అతని సహచరులు మండిపడ్డారు. కులం పేరుతో దూషించారు. వాళ్ళను చంపేస్తామని బెదిరించారు.
అప్పటికే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ నెంబర్ 112కు కాల్ చేసారు. దాంతో పోలీసులు అక్కడకు సకాలంలో చేరుకోగలిగారు. పోలీసులను చూస్తూనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఆ సమయంలో కూడా రషీద్ బాధితురాలి తండ్రివైపు తుపాకి గురిపెట్టి ఆ సంఘటన గురించి ఎక్కడైనా నోరు తెరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు.
మే 24న పోలీసులకు నిందితుల గురించి సమాచారం లభించింది. రషీద్, అతని తండ్రి నన్హే ఎక్కడున్నారో తెలిసింది. వారిని బంధించి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.