ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఇవాళ ఢిల్లీ కోర్టులో కన్నీళ్ళ పర్యంతమయ్యారు. బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తే తనకూ తన కుటుంబానికీ ప్రమాదమని వాపోయారు. బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా స్వాతి ఆ వ్యాఖ్యలు చేసారు.
అంతకుముందు బిభవ్ కుమార్ న్యాయవాది, ఆ కేసులో ఢిల్లీ పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి నివాసంలోకి అక్రమంగా చొరబడినందుకు (ట్రెస్పాసింగ్) ఎంపీనే విచారణ చేయాలని డిమాండ్ చేసారు. ‘‘స్వాతి నేరుగా సీఎం నివాసంలోకి ప్రవేశించారు. అది అక్రమ చొరబాటే. ఒక ముఖ్యమంత్రి నివాసంలోకి ఎవరు పడితే వారు అలా వెళ్ళిపోవచ్చా? ఆమెను బైట వేచిఉండమని చెప్పారు. కానీ ఆమె తోసుకుంటూ సెక్యూరిటీ జోన్ దాటి లోపలికి వెళ్ళిపోయారు. ఎంపీ అయినంత మాత్రాన ఏదైనా చేసేయడానికి లైసెన్స్ ఉన్నట్లా? ఆమె కేజ్రీవాల్ ఇంట్లోకి చొరబడ్డారు, కానీ ఎఫ్ఐఆర్ మామీద నమోదయింది. ఇదేం దర్యాప్తు?’’ అంటూ వాదించారు.
ఢిల్లీ పోలీస్ తరఫు న్యాయవాది బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనను నిరాకరించారు. ‘‘స్వాతీ మాలీవాల్ సిట్టింగ్ ఎంపీ. ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పెర్సన్గా పనిచేసారు. కేజ్రీవాల్ ఆమెను ‘లేడీ సింగం’ అని పిలిచేవారు. ఇప్పుడామె బిభవ్ పేరు చెడగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఎలా అంటారు? అసలు అతనెవరు? అతనేమీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఇప్పటికే అతన్ని ఉద్యోగంలోనుంచి తీసేసారు. అలాంటి వ్యక్తి ఎలాంటి కవ్వింపు చర్యా లేకుండానే ఒక మహిళను చితకబాదారు. కింద పడేసి లాగారు. ఆమె దుస్తులు చెదిరిపోయేలా కొట్టారు. స్వాతి ఒకవేళ అక్రమంగా చొరబడితే పోలీస్ నెంబర్ 100కు ఎందుకు కాల్ చేయలేదు? భద్రతాసిబ్బంది దగ్గరుండి లోపలికి తీసుకువెడితే ట్రెస్పాస్ ప్రసక్తి ఎలా వస్తుంది?’’ అని వాదించారు.
స్వాతి కోర్టులో తన వాదన వినిపించారు. ‘‘నన్ను దారుణంగా కొట్టారు. ఇప్పుడు ఆప్ నేతలు నన్ను బీజేపీ ఏజెంట్ అంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి ఆ పార్టీకి పెద్ద సైన్యమే ఉంది. బిభవ్ కుమార్ బైటకు వస్తే నా ప్రాణాలకూ నా కుటుంబ సభ్యుల ప్రాణాలకూ పెద్ద ప్రమాదమే’’ అని చెప్పారు.
బిభవ్‌కుమార్ బెయిల్ పిటిషన్ మీద విచారణలో ఒకదశలో స్వాతీ మాలీవాల్ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ప్రత్యేకించి, వివాదాస్పద యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనకు వ్యతిరేకంగా వీడియో చేసిన తర్వాత అత్యాచార బెదిరింపులు, చంపేస్తామన్న బెదిరింపులూ పెరిగిపోయాయని స్వాతి కన్నీళ్ళు పెట్టుకున్నారు.
స్వాతీ మాలీవాల్ ఆప్ రాజ్యసభ ఎంపీ. మే 13న ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళారు. అక్కడ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టారని, చితకబాదారని, నేలమీద పడేసి తన్నారనీ స్వాతి ఫిర్యాదు చేసారు. దానిపై ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ కేసులో బెయిల్ కోసం బిభవ్ ప్రయత్నిస్తున్నారు. బెయిల్ పిటిషన్ మీద ఇవాళ వాదనలు జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మొదట్లో బిభవ్ కుమార్ స్వాతీ మాలీవాల్‌తో అనుచితంగా ప్రవర్తించారని ప్రకటించింది. అయితే కొద్దిరోజులకే మాట మార్చింది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ పన్నిన కుట్రలో స్వాతి భాగమైందని ఆరోపించింది.