బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఆదివారం తీవ్రతుపానుగా బలపడి, అర్ధరాత్రి దాటాక బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది. ఇవాళ ఇది తుపానుగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రెమాల్ తుపాను తీరం దాటే వేళ గరిష్ఠంగా 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. బెంగాల్ ప్రభుత్వం తీరప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను తరలించింది. ఆ ప్రాంతంలోని రైలుసేవలను రద్దుచేసారు. కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులు నిలిపివేసారు.
రెమాల్ ఇవాళ మళ్ళీ తుపానుగా బలహీనపడనుంది. దాంతో కోల్‌కతా, సాగర్, హుగ్లీ పోర్టులకు ఎనిమిదో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. పారాదీప్, ధామ్రా రేవులకు మూడవ ప్రమాద హెచ్చరికలు జారీచేసారు. గోపాలపూర్ నుంచి తూత్తుక్కుడి వరకూ ఉన్న అన్ని రేవుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.
రెమాల్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని తీరప్రాంతాల్లో అలలు ఎగసిపడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట వంటి కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్‌పై రాకపోకలు నిలిపివేసారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఒక్కరోజులోనే ఉష్ణోగ్రతలు కనీసం ఆరు డిగ్రీలు పెరిగాయి. ఇవాళ ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. అదే సమయంలో, 72 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు, 200 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.