ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఆదివారంనాడు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై హమాస్ ఉగ్రవాదులు క్షిపణి దాడులు జరిపారు. రఫా నుంచి రాకెట్లు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ రాజధానిలో అలర్ట్ అలారమ్ మోగించారు. గడచిన ఐదు నెలల కాలంలో హెచ్చరికల అలారమ్ మోగించడం ఇదే మొదటి సారి. రాజధాని నగరం దట్టమైన పొగతో నిండిపోయిందని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. హమాస్ మెరుపుదాడులకు ఇజ్రాయెల్ ధీటుగా బదులిచ్చింది.
రఫాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడ్డాయి. క్షిపణుల వర్షం కురిపించాయి. రఫాలో సురక్షిత ప్రాంతాలుగా ప్రకటించి స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. నిరాశ్రయలు తలదాచుకుంటున్న ప్రాంతాల్లో దాడులు జరిగాయని హమాస్ చెబుతోంది. నిరాశ్రయుల గుడారాల్లో హమాస్ ఉగ్రవాదులు నక్కిఉన్నారనే సమాచారంతోనే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజా దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఐక్యరాజ్యసమితి పంపించిన ఆహార సాయం పాలస్తీనా చేరింది. ఆదివారం ఒక్క రోజే 200 ట్రక్కులు రఫాలోకి ప్రవేశించారు. అక్కడ పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు కనీస వైద్యం కూడా అందడం లేదని దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అంతర్జాతీయ న్యాయస్థానం దాడులు ఆపాలంటూ ఆదేశించిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ రఫాపై భీకరదాడులకు దిగింది. దాడులు ఆపకపోతే ఆయుధసాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.