పపువా న్యూగినియా లో పెను విషాదం చోటుచేసుకుంది. ఎన్గా ప్రావిన్స్‌లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నాటి ఈ ప్రకృతి విపత్తు కారణంగా 100 మందికిపైగా మృతి చెందినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. దాదాపు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
విపత్తు కారణంగా 60 నివాసాలు కొండచరియల కింద నేలమట్టమైనట్లు భావించారు.కానీ తాజా లెక్కల ప్రకారం. 150 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయినట్లు తేలింది. దాదాపు 670 మంది చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలోని ఎన్గా ప్రావిన్స్‌లో ఈ విషాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో ప్రాణనష్టం పెరిగింది.
కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచిఉండటంతో పాటు ఘటనాస్థలికి వెళ్లే మార్గంలో తెగల ఘర్షణ కారణంగా బాధితులకు సామగ్రి చేరవేయడంలోఅవరోధాలు ఏర్పడుతున్నాయి. సైనికుల పహారా మధ్య సహాయక కాన్వాయ్‌లు ఘటనాస్థలికి చేరుకోవాల్సి వస్తోంది.