ఛాయ్ తో తన అనుబంధం గాఢమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్ లో పర్యటించిన ప్రధాని మోదీ, సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసి ఓటు హక్కును వృథా చేసుకోవాలని ఎవరూ అనుకోవడం లేదని అన్నారు.
ఏ ప్రభుత్వం కచ్చితంగా కొలువుతీరుతుందని నమ్ముతారో ఆ పార్టీకే సామాన్యుడు పట్టం కడతాడని పేర్కొన్నారు. ఇండీ కూటమి పార్టీలు కుల, కుటుంబ పార్టీలని దుయ్యబట్టిన మోదీ, వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.
యాదవుల్లో ఎందరో సమర్ధనేతలున్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కేవలం తన కుటుంబ సభ్యులకే పార్టీ టికెట్లు కేటాయిస్తారని ఆరోపించారు. పట్టుబడిన ఉగ్రవాదులను కూడా ఎస్పీ ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. యూపీ, పూర్వాంచల్‌ను మాఫియాకు అడ్డాగా మార్చారన్నారు. మాఫియాను సమాజ్ వాదీ పార్టీ ఓటు బ్యాంక్‌గా చూస్తుందన్నారు.