తెలంగాణ లో పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే, అంటే ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావడం పై పలువురు విమర్శలు చేయడంపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8.45 గంటలకే తరగతులు ప్రారంభమై మధ్యాహ్నం 3.45 గంటల వరకు కొనసాగుతాయి. ఇతర ప్రాంతాల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉదయం 9 గంటలకు స్కూళ్లు తెరవనుండగా సాయంత్రం 4 గంటలకు మూతబడతాయి. అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 వరకు తరగతులు కొనసాగుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే ఉన్నత పాఠశాలల వేళలే పాటించాలని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం కోసం 45 నిమిషాల విరామం ప్రకటించారు.
ఈ విద్యాసంవత్సరం జూన్ 12న ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ముగియనుంది. మొత్తంగా 229 రోజులపాటు తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.