తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయణిస్తూ మరింత బలపడుతోంది. నేటి (ఆదివారం) అర్ధరాత్రికి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబర్ దీవుల ప్రభుత్వాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.