టెక్నాలజీ సాయంతో ఓ అరాచకవాది రెచ్చిపోయాడు. ఏకంగా ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ సేథీ జిల్లాలో ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
పురుషుల వాయిస్‌ను మహిళల స్వరంగా మార్చే యాప్ సాయంతో ఓ కిరాతకుడు చెలరేగిపోయాడు. పేద విద్యార్థినులకు ఉపకారవేతనాలు ఇప్పిస్తానంటూ మహిళ గొంతు వచ్చేలా యాప్ ఉపయోగించి వారిని మోసం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఓ కాలేజీ అధ్యాపకురాలిగా పరిచయం చేసుకునేవాడు. తరవాత ఉపకార వేతనం ఇప్పిస్తానని, తన కొడుకు బైక్‌పై వచ్చి, మిమ్మల్ని మా ఇంటికి తీసుకువస్తాడంటూ నమ్మించే వాడు. తలకు హెల్మెట్, చేతులకు బ్లౌజులు ధరించి విద్యార్థినులను బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఇతనికి మరో ముగ్గురు సహకరించినట్లు తెలుస్తోంది. ఇలా ఏడుగురిని అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
ఇతని బాధితులు ఇంకా చాలా మంది ఉంటారని అనుమానిస్తున్నారు. నలుగురు విద్యార్థినులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీఎం మోహన్ యాదవ్ దీనిపై సిట్ వేశారు. నిందితుడు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని కూల్చి వేశారు. ఇప్పటికే బ్రిజేష్ ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన వారికోసం వేట సాగిస్తున్నారు.