ఈ ఎన్నికల సీజన్లో కాబోయే ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్న విషయాలపై మీడియా రకరకాల విశ్లేషణలతో హోరెత్తించేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలవడం, నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి అవడం ఇష్టం లేని మీడియా సంస్థలు, మొదట్లో ఇండీ కూటమి విజృంభించేస్తోందంటూ ప్రచారం చేసాయి. ఒక్కో దశ పోలింగ్ ముగిసేకొద్దీ ఎక్కడా ఆ పరిస్థితి కనబడకపోయేసరికి ప్లేటు ఫిరాయించడం మొదలుపెట్టాయి. మోదీయే మళ్ళీ ప్రధాని అవుతాడు కానీ ఆయన పెట్టుకున్న 400 స్థానాల లక్ష్యాన్ని చేరుకోలేడు. అసలు 300 మార్కు అందుకోవడమే కష్టం అంటూ ప్రచారం చేస్తున్నాయి.
ఎన్నికల వ్యూహకర్తగా కెరీర్ మొదలుపెట్టి రాజకీయవేత్తగా మారిన ప్రశాంత్ కిషోర్ అలాంటి విశ్లేషణలు చేస్తున్నారు. దాన్ని మోదీ వ్యతిరేక మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తెలివైన విశ్లేషకుడిగా పేరున్న ప్రశాంత్ కిషోర్, మోదీయే మరోసారి ప్రధానమంత్రి అవుతాడన్న విషయాన్ని ఒప్పుకుంటూనే ఆ విషయంలో మోదీ సామర్థ్యాన్ని వీలైనంతగా తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే, నాలుగు కారణాల వల్ల మోదీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాడు. అవి… హిందుత్వం పట్ల బిజెపి నిబద్ధత, జాతీయవాదంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, బిజెపి సంస్థాగత క్రమశిక్షణ, సంక్షేమ పథకాలు.
విచిత్రం ఏంటంటే, మోదీ ప్రభుత్వ నిర్వహణా సామర్థ్యాన్ని ప్రశాంత్ కిషోర్ విస్మరించాడు. అది ఉద్దేశపూర్వకమా కాదా అన్నది వేరే చర్చనీయాంశం. కానీ మోదీ సమర్ధతకు ఒక ప్రధాన నిదర్శనం ఉంది. అదే ద్రవ్యోల్బణ నియంత్రణ.
ప్రభుత్వాలను తారుమారు చెయ్యగల శక్తి ద్రవ్యోల్బణానికి ఉంది. అది ప్రతీ పౌరుడిపైనా పన్ను భారాన్ని పెంచుతుంది. వారి సంపదతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ప్రతి పౌరుడి దినసరి ఖర్చుపైన ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని దేశాలలో పెద్ద ఎత్తున ప్రజా విప్లవాలు చెలరేగిన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు.
భారత రాజకీయాలలోనూ అలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల సారధ్యంలోని యుపిఎ-2 ప్రభుత్వంపైన ప్రజల్లో ఏర్పడిన తీవ్ర ఆగ్రహానికి ఒక కారణం… ఆ ప్రభుత్వ హయాంలో దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం. అప్పట్లో అది గరిష్టంగా 12 శాతానికి చేరుకుంది. రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు… ఆర్ధిక మాంద్యాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఒక ఆయుధంగా మలచుకుని ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని పదేపదే ప్రయత్నించారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ద్రవ్యోల్బణం 2019 ఎన్నికల్లో గానీ, 2024 ఎన్నికల్లో గానీ ప్రముఖ నినాదంగా మారలేదు. టీవీలలో అదేపనిగా తప్పుడు విశ్లేషణలిస్తూ, దేశ వినాశనాన్ని మాత్రమె కోరుకునే కొంతమంది అపశకున పక్షులు మాత్రం… ఇదిగో ఆర్ధిక మాంద్యం వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అంటూ జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. యదావిధిగా జనాలెవరూ వాళ్ళని పట్టించుకోనూ లేదు, వాళ్ళ కలలేవీ నిజం కాలేదు.
ద్రవ్యోల్బణం నిజంగా అదుపు దాటిపోయి వుంటే… దానిద్వారా ఆర్థిక వ్యవస్థలో ప్రతీ ఒక్కరి రోజువారీ జీవితంపైనా ప్రభావం చూపే అధిక ధరలు, కరువు, ఆహార కొరత వంటి సమస్యల చుట్టూ ప్రజలను కూడగట్టడం ఏ పార్టీకైనా పెద్ద కష్టమేమీ కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన, జరుగుతున్న ఈ రెండు ఎన్నికల్లోనూ ద్రవ్యోల్బణం కీలకాంశం కాలేదంటే… గతంలో లాగా ప్రజలు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పెద్దగా అనుభవించడం లేదని, ఇబ్బంది పడటం లేదనీ అర్ధమవుతుంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దేశానికి ప్రధానులుగా పని చేసిన వారి హయాంలలోని సగటు ద్రవ్యోల్బణాలను ఒకసారి చూద్దాం.…
ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించటానికి మన దేశంలో 2012 వరకు టోకు ధరల సూచీ Wholesale Price Index (WPI)ని అనుసరించారు. 2012 నుంచి వినియోగ ధరల సూచీ Consumer Price Index (CPI) ని అనుసరిస్తున్నారు. 1961కి ముందరి CPI సమాచారం అందుబాటులో లేదు. మన దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరి హయాంలలోని WPI సమాచారం మాత్రం అందుబాటులో ఉంది.
దాని ప్రకారం, ప్రతిపక్షాల వాదనలకు విరుద్ధంగా, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారత ప్రధానమంత్రులు అందరిలోనూ, ద్రవ్యోల్బణ నియంత్రణలో అత్యుత్తమ రికార్డు ప్రస్తుత ప్రధాని మోడీకి మాత్రమే ఉంది.
మోదీ హయాంలో సగటు CPI ద్రవ్యోల్బణం 5.03 శాతం, అది RBI ద్రవ్యోల్బణ లక్ష్యం 4-6 శాతం మధ్యలోనే ఉంది. WPI ద్రవ్యోల్బణం రేటు ఇంకా తక్కువగా, అంటే 3.1 శాతం ఉంది. అది ఆల్టైమ్ రికార్డ్ అన్నమాట. కనీసం మోడీకి ముందు ప్రధానిగా చేసిన మన్మోహన్ సింగ్ హయాంలోని ద్రవ్యోల్బణంతో తో పోల్చినా ఇదే చాలా ఉత్తమమైన పనితీరు. మన్మోహన్ పాలనాకాలంలో CPI ద్రవ్యోల్బణం 8.27%. ఇప్పుడది 5.03%. WPI ద్రవ్యోల్బణం మన్మోహన్ ఏలుబడిలో 6.54% ఉంటే ఇప్పుడు 3.1శాతానికి తగ్గింది. అతికొద్దిమంది ప్రధానమంత్రులే CPI ద్రవ్యోల్బణాన్ని RBI లక్ష్యపు గరిష్ట పరిమితి 6% కంటే తక్కువగా ఉంచగలిగారు. ఆ విషయంలో మోడీ అద్భుతంగా పనిచేశారు.
మనదేశంలో వివిధ ప్రధానుల పాలనా కాలంలో ద్రవ్యోల్బణంలోని వ్యత్యాసాలు గమనిస్తే ద్రవ్యోల్బణ రేటులో ప్రభుత్వ విధానాలు, నాయకత్వం ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని స్పష్టం చేస్తున్నాయ్.
ఉదాహరణకు, మే 2014లో మోడీ అధికారం చేపట్టేనాటికి ద్రవ్యోల్బణం 8% ఉంది. డిసెంబరు నాటికి అది దాదాపు 4%కి, అంటే సగానికి పడిపోయింది. అంత తక్కువ టైంలో ద్రవ్యోల్బణం అంతగా అదుపులోకి వచ్చిందంటే అర్థం దానిపై ప్రభుత్వ ప్రభావం ఉందనే కదా?
2008 నుండి అమెరికా పరిస్థితిని కూడా గమనిస్తే… ప్రభుత్వంతో పోలిస్తే ద్రవ్యోల్బణం విషయంలో కేంద్ర బ్యాంకుల పాత్ర పరిమితమని స్పష్టంగా అర్ధమవుతుంది. 2008 నుండి దశాబ్దం పాటు అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు 0%. కోవిడ్ సమయంలో ఆర్ధిక విషయాలలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. దాన్ని నియంత్రించడానికి యుఎస్ కేంద్రీయ బ్యాంకు చేసిన ప్రయత్నాలు చూస్తే ద్రవ్యోల్బణం అదుపులో బ్యాంకుల పరిమిత పాత్ర అర్థమవుతుంది. మోడీ హయాంలో సగటున ద్రవ్యోల్బణం రేటు అమెరికాలో కంటే 2.39% ఎక్కువ. PM మన్మోహన్ సింగ్ కాలంలో ద్రవ్యోల్బణం రేటు అమెరికాలో కంటే 5.58% ఎక్కువ. అదే పీవీ నరసింహా రావు హయాంలో అది 7.17% ఎక్కువ.
భారతదేశం సుదీర్ఘకాలం నుంచీ అధిక ద్రవ్యోల్బణాని పెట్టింది పేరు. ప్రధాని మోడీ పాలనతో అందులో మార్పు వచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం స్థాయులలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన అధిక ద్రవ్యోల్బణాల దుర్భర గతాన్ని చూస్తే అది చిన్న విజయమేమీ కాదు.
దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి. అంతకుముందు, దేశంలోని అరకొర రవాణా సౌకర్యాలుండడం అధిక ద్రవ్యోల్బణానికి నేరుగా దోహదపడింది. అప్పుడు ఒకచోట నుంచి మరోచోటకు వస్తువులు సకాలంలో చేరేవి కావు. పెర్మిట్లు, టాక్సేషన్ అన్నీ ఖర్చుతోనూ, సమయంతోనూ కూడుకున్నవి. వాటికోసం వాహనాలు గంటలు గంటలు వేచిచూడాల్సి వచ్చేది. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో అలాంటి దృశ్యాలు మరీ ఎక్కువ. GST వచ్చాక ఆ పరిస్థితి మారింది. దానివల్ల ఇంధన ఖర్చు, TIME SAVE అయింది. టైమ్ సేవ్ అయింది. మొత్తంగా రవాణా వ్యవస్థ వేగం పుంజుకుంది.
క్రూడాయిల్ ధరలలో తగ్గుదల కూడా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సాయపడింది. పెట్రోలు, డీజిలు 40, 50 రూపాయలకు ఇచ్చెయ్యొచ్చు కదా? అని ప్రతిపక్షాలు ప్రకటనలు ఇచ్చేస్తుంటాయి కదా? నిజానికి ఆ పని చేసే ఉంటే… 140 కోట్ల జనాభా ఉన్న దేశం, కరోనా మహమ్మారిని ఎదుర్కున్న దేశం, తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి జారిపోయేది. ప్రజలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాల్సిన దుస్థితి ఉండేది. మోడీ ప్రభుత్వం ముందుచూపు వల్లే కరోనా లాంటి సంక్షోభాన్ని సమర్థంగా ఎడుర్కొగలిగాం. 140 కోట్ల జనాభాకి ఉచితంగా వ్యాక్సిన్ అందింది. 80 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత రేషన్ అందుతోంది.
డిజిటల్ సంస్కరణలు కూడా మన దేశ ఆర్ధిక వ్యవస్థ పుష్టికి మరొక ముఖ్యకారణం. పాలనలో అవినీతి తగ్గడం, పారదర్శకత పెరగడం, ముఖ్యంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించడం. సహజంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందే క్రమంలో జరిగే లీకేజీలు తరచు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. ప్రజలకి డబ్బులు పంచడం కంటె… ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన ఇళ్ళను, టాయిలెట్లనూ కట్టించి ఇవ్వడం లాంటి ప్రత్యక్ష ప్రయోజన కార్యక్రమాలు ప్రధానంగా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి.
అలాగే సంపద సృష్టి కూడా. కార్పొరేట్ పన్ను తగ్గింపులు, పిఎల్ఐలతో సహా అనేక పథకాలతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో మోదీ బాగా పని చేసారు. అవన్నీ పటిష్ట ఆర్థిక క్రమశిక్షణతో వచ్చాయి. వాటి కారణంగానే ప్రపంచంలోని బలమైన ఆర్ధిక వ్యవస్థలలో 5వ స్థానానికి భారత్ చేరుకుంది. త్వరలో మూడవ స్థానానికి చేరుకోనుంది. భారత ఆర్ధిక వ్యవస్థకు బహుశా దేశ చరిత్రలోనే ఇది అత్యుత్తమమైన కాలం, స్వర్ణ యుగం.
నరేంద్రమోదీ ఆదర్శవంతమైన ద్రవ్యోల్బణ నిర్వహణ, వివేకవంతమైన ఆర్థిక పాలన కేస్ స్టడీగా గుర్తింపు పొందాలి. అది వర్ధమాన దేశాల విధానకర్తలకు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి పోరాడుతున్న కేంద్ర బ్యాంకర్లకు విలువైన పాఠాలు చెబుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణలో ప్రభుత్వాల పాత్ర పరిమితమనే అభిప్రాయాన్నీ తుత్తునియలు చేస్తుంది.
స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలకంటే ఎక్కువగా వివేకవంతమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక దృక్పథాన్ని పాలకులు ప్రదర్శిస్తే… ఆ దేశం గొప్ప విజయాన్ని, ఆర్ధిక ప్రగతిని ఎలా సాధిస్తుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం నుండి బయటపడినప్పుడే భారతదేశం మరింత అభివృద్ధిని సాధించగలుగుతుంది. ప్రధాని మోడీ హయాంలో భారత్ ఆ బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు