ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫాలో వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. రఫాలో దాడులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారిందంటూ దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలోని 15 మంది జడ్జిలు శుక్రవారం దీనిపై కీలక తీర్పు వెలువరించారు. వెంటనే రఫాలో సైనిక చర్య ఆపేయాలంటూ ఆదేశించారు. గతంలో ఐసీజే జారీ చేసిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదని హెచ్చరించింది. నెల రోజుల్లో రఫాలో పరిస్థితులపై నివేదిక కూడా సమర్పించాలని ఐసీజే ఆదేశించింది.
పాలస్తీనాలోని రఫాలో హమాస్ ఉగ్రవాదులు దాగి ఉన్నారనే అనుమానంలో అక్కడ ఇజ్రాయెల్ సైన్యం దాడులు ముమ్మరం చేసింది. దీంతో రఫాలో పరిస్థితులు దిగజారాయి. అక్కడ తాగడానికి మంచినీరు, ఆహారం కూడా అందడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షలాది మంది చనిపోయే ప్రమాదముందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ, ఐసీజే తీర్పు రఫా ప్రజలకు ఊరటనిస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఐసీజే ఆదేశాలు ఇజ్రాయెల్ పాటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.