మన దేశంలో ఢిల్లీది ఒక ప్రత్యేక ప్రతిపత్తి. సాంకేతికంగా అది కేంద్రపాలిత ప్రాంతమే అయినా, రాష్ట్రాలకు ఉన్నట్లు ముఖ్యమంత్రి ఉంటారు. అలాగే అక్కడి ఓటర్లు కూడా ప్రత్యేకమైన వారు. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, గత మూడు శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించగలదా? దేశ రాజధానిపై పట్టు నిలబెట్టుకోగలదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఢిల్లీలో ఏడు లోక్‌సభా స్థానాలున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండీ కూటమిలో భాగంగా ఉన్నాయి. ఆప్ 4 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 3 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోంది.
చాందినీచౌక్ నియోజకవర్గంలో బీజేపీ తమ అభ్యర్ధిని మార్చింది. గత రెండుసార్లు విజయం సాధించిన డాక్టర్ హర్షవర్ధన్ బదులు ప్రవీణ్ ఖండేల్‌వాల్‌ను బరిలోకి దింపింది. ప్రవీణ్ లోక్‌సభకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జేపీ అగర్వాల్‌ను మోహరించింది. ఆయన లోక్‌సభకు పోటీ చేయడం ఇది పదోసారి. గతంలో ఆయన మూడుసార్లు గెలిచారు.
ఈశాన్య ఢిల్లీలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీకి మరోసారి అవకాశమిచ్చింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ టికెట్ ఇచ్చిన సిటింగ్ ఎంపీ ఈయన ఒక్కరే. 2019లో సీపీఐ అభ్యర్ధిగా బిహార్ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయిన కన్హయ్యా కుమార్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈశాన్య ఢిల్లీ బరిలోకి దిగారు.
తూర్పు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కులదీప్ కుమార్ పోటీలో ఉన్నారు. 2019లో బీజేపీ టికెట్ మీద గెలిచిన క్రికెటర్ గౌతం గంభీర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో కమలం పార్టీ హర్ష్ మల్హోత్రాను నిలబెట్టింది. 2019లో గౌతం గంభీర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ నేత అరవిందర్ సింగ్ లవ్లీ ఇటీవలే బీజేపీలో చేరడం ఆ పార్టీ బలాన్ని పెంచింది. లవ్లీకి పంజాబీ ఓటర్లలో పట్టు గణనీయంగా ఉంది.
పశ్చిమ ఢిల్లీలో బీజేపీ కమల్‌జీత్ సెహ్రావత్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీ మహాబల్ మిశ్రాను బరిలోకి దింపాయి. కమల్‌జీత్ గతంలో దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. ఆప్ అభ్యర్ధి మహాబల్ మిశ్రా గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. 2020లో ఆయనను పార్టీలోంచి తొలగించడంతో 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. గతంలో ఒకసారి ఎంపీగా పనిచేసిన మిశ్రాకు యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో గట్టి పట్టు ఉంది.
వాయవ్య ఢిల్లీలో బీజేపీ టికెట్ మీద యోగేంద్ర చందోలియా పోటీ పడుతున్నారు. 2019లో హన్స్‌రాజ్‌హన్స్ భారీ విజయం సాధించినా పార్టీ ఆయనను కాదని చిరకాలంగా పార్టీ కార్యకర్తగా ఉన్న యోగేంద్రను ఎంచుకుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉదిత్ రాజ్ పోటీ చేస్తున్నారు. ఆయన 2014లో బీజేపీ టికెట్ మీద వాయవ్య ఢిల్లీ ఎంపీ సీటులో విజయం సాధించారు. 2019లో ఆయన పార్టీ మారారు.
న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్ధిగా బాన్సురీ స్వరాజ్, ఆప్ అభ్యర్ధిగా సోమనాథ్ భారతి పోటీ పడుతున్నారు. భారతి ఆప్ పెట్టినప్పటినుంచీ కేజ్రీవాల్‌తో కలిసే ఉన్నారు. బాన్సురీ దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె.
దక్షిణ ఢిల్లీలో బీజేపీ 71ఏళ్ళ రాంవీర్‌సింగ్ బిధూరీని పోటీలోకి దింపింది. దక్షిణ ఢిల్లీ ఎంపీ సీటు పరిధిలోని మొత్తం పది అసెంబ్లీసెగ్మెంట్లలోనూ గెలిచిన ఏకైక బీజేపీ నాయకుడు బిధూరీ. ఇక ఆప్ నుంచి సహీరాం పహల్వాన్ పోటీ పడుతున్నారు. పహిల్వాన్ 2015, 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుగ్లకాబాద్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్ధిగా గెలిచారు. ఇప్పుడు తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచారు.
బీజేపీ అభ్యర్ధుల్లో బాన్సురీ స్వరాజ్, మనోజ్ తివారీ, ప్రవీణ్ ఖండేల్వాల్, హర్ష్ మల్హోత్రాల భవిష్యత్తుపై ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో కన్హయ్య కుమార్, ఉదిత్ రాజ్, ఆమ్ ఆద్మీ పార్టీలో సోమనాథ్ భారతి, మహాబల్ మిశ్రాల పోటీపై ఆసక్తి నెలకొని ఉంది.