‘హమారే బారహ్’ పేరుతో ఓ సినిమా 2024 జూన్ 7న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ఆ సినిమా టీజర్ మే 20న విడుదల అయింది. ముస్లిం మహిళలు ఎదుర్కొనే సవాళ్ళే ఇతివృత్తంగా ఆ సినిమా రూపొందింది. ఆ సినిమా నిర్మాత, దర్శకుడు, ప్రధాన నటులను చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు తలలు నరికే వీడియోలను పోస్ట్ చేస్తూ ఆ తరహాలో చంపుతామంటూ హెచ్చరిస్తున్నారు.
తహరీక్-ఎ-లబైక్ పాకిస్తాన్ అనే తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ, ముఫ్తీ సల్మాన్ అజగరీ అనే భారతీయ అతివాది ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హమారే బారహ్ సినిమా దర్శకనిర్మాతలు, ప్రధాన నటులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు ‘అల్లాహో అక్బర్’ వంటి ఇస్లామిక్ నినాదాలు ఇస్తూ తమ ప్రత్యర్థులను తలలు నరికి చంపిన వీడియోలను పోస్ట్ చేస్తూ అదే తరహా గతి ఈ సినిమా యూనిట్‌కు పడుతుందంటూ ఆ బెదిరింపుల్లో చెబుతున్నారు.
ఆ బెదిరింపులను పోస్ట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారిని ట్రేస్ చేసే ప్రయత్నాలు జరిగాయి. మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా నుంచి ఆ పోస్ట్‌లు చేసినట్లు తెలిసింది. ఆ పోస్ట్‌లు పెట్టిన వారికి నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం ‘ఎస్‌డిపిఐ’తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
హమారే బారహ్ సినిమా ట్రైలర్ విడుదల చేసిన జీ మ్యూజిక్ సంస్థ మీద సైబర్ దాడులు జరిగాయి. సినిమా నిర్మాత ఫోన్‌నెంబర్, ఇమెయిల్ ఐడీ, చిరునామా వంటి వివరాలు ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగంగా పెట్టారు. నిర్మాతలు రవి గుప్తా, సంజయ్ నాగ్‌పాల్, షేవ్‌బాలక్ సింగ్, దర్శకుడు కమల్ చంద్ర, సినిమాలో నటించిన అన్నూకపూర్, పార్థ్ సంథన్ తదితరులపై దాడి చేయాలంటూ ముస్లిములను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వారిని చంపేస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు.
ఈ సినిమాకు మొదట ‘హమ్ దో హమారే బారహ్’ (మేమిద్దరం, మాకు పన్నెండుమంది పిల్లలు) అనే పేరు పెట్టారు. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ – సీబీఎఫ్‌సీ సూచన మేరకు ‘హమారే బారహ్’ అని పేరు మార్చారు. అన్నూకపూర్, అశ్వినీ కల్సేకర్, మనోజ్ జోషి తదితరులు నటించిన ఈ సినిమాని ఇటీవలే 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు