ఈవీఎంల ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి, అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6న ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని వివరించింది.
పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించిన హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల్లో తమపై కేసులు నమోదు అయ్యాయని తమను అరెస్టు చేసే అవకాశముందని మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు.
కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని ఆస్మిత్ రెడ్డిని ఆదేశించిన న్యాయస్థానం, నలుగురి కంటే ఎక్కువమందితో తిరగరాదని ఉత్తర్వలు జారీ చేసింది.