మే 13న తనపై దాడి జరిగినప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంటిలోపలే ఉన్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ వెల్లడించారు. బిభవ్ కుమార్ తనను కొట్టినప్పుడు కేజ్రీవాల్ లోపలే ఉన్నారనీ, తనను రక్షించడానికి ఎవరూ రాలేదనీ ఆమె తెలియజేసారు.
మే 13 ఉదయం అసలేం జరిగింది అన్న విషయాన్ని స్వాతి ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీకి వివరించారు. ‘‘ఆరోజు ఉదయం సుమారు 9 గంటలకు నేను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఆయనను కలవడానికి వెళ్ళాను. అక్కడివారు నన్ను డ్రాయింగ్రూంలో కూర్చోమన్నారు. కేజ్రీవాల్ లోపల ఉన్నారనీ, కొద్దిసేపట్లో వచ్చి నన్ను కలుస్తారనీ చెప్పారు. తర్వాత కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్ వచ్చాడు. అతను రావడం రావడమే కోపంగా ఉన్నాడు. ‘ఏమైంది, కేజ్రీవాల్ వస్తున్నారా?’ అని అడిగాను. అంతకుమించి నేను ఇంకేం మాట్లాడలేదు. అతను నన్ను దవడ మీద 7-8సార్లు కొట్టాడు. అతన్ని తోసేయడానికి ప్రయత్నించాను. అతను నా కాళ్ళు పట్టుకుని నన్ను ఈడ్చేసాడు. నా తలను టేబుల్‌కు బాదాడు. నేను నేల మీద పడిపోయాను. అప్పుడు నన్ను కాళ్ళతో ఎక్కడపడితే అక్కడ తన్నసాగాడు. నేను కేకలు పెట్టాను. ఎవరైనా సాయం చేయాలని అరిచాను. కానీ ఎవరూ రాలేదు’’ అని స్వాతీ మాలీవాల్ చెప్పారు.
బిభవ్ కుమార్ తనంతట తానే కొట్టారా లేక ఎవరైనా ఆదేశిస్తే కొట్టారా అన్న విషయం తనకు తెలీదని స్వాతి చెప్పారు. ఆ విషయం దర్యాప్తులో బైటపడవచ్చు అన్నారు. ‘‘నేను ఢిల్లీ పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నాను. నేను ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వడం లేదు. విషయం ఏంటంటే నేను డ్రాయింగ్రూంలో ఉన్నాను, కేజ్రీవాల్ ఇంటిలోపల ఉన్నారు. అప్పుడే నన్ను దారుణంగా చితకబాదారు. నేను చాలా బాధతో అరుపులూ కేకలూ పెట్టాను, అయినా ఎవ్వరూ నాకు సాయానికి రాలేదు. నాకేమవుతుంది, నా కెరీర్ ఏమవుతుంది అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నన్ను వాళ్ళు ఏం చేయగలరు? నేను ఆలోచించింది ఒకటే… నేను మహిళలందరికీ ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉంటాను, ఎప్పుడూ సత్యానికి అండగా నిలబడాలి. మీతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే తప్పకుండా పోరాడాలి, నిజంగానే ఫిర్యాదు చేయాలి అని చెప్పేదాన్ని. అలాంటి నేను ఇవాళ ఎలా పోరాడకుండా ఉండగలను?’’ అని స్వాతి చెప్పుకొచ్చారు.