మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి ఆరోజు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని మీనా స్పష్టం చేసారు. వీడియో బైటకు ఎలా లీక్ అయిందో తెలుసుకుంటామన్నారు.
మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్న ముఖేష్‌కుమార్ మీనా, బైటి నాయకులెవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళకూడదని ఆదేశించారు. టీడీపీ నాయకులు ఈ సమయంలో అక్కడికి వెళ్ళడం మంచిది కాదని మీనా అన్నారు. ఆ గ్రామాలకు ఎవ్వరినీ వెళ్ళనీయవద్దని సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులకు మీనా ఆదేశాలు జారీ చేసారు. లెక్కింపు ఫలితాలను కచ్చితంగా, వేగంగా ప్రకటించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మీనా ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 25నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు. కౌంటింగ్ పూర్తయేవరకూ స్ట్రాంగ్‌రూంల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేసారు.