నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమిది మంది సభ్యులకు మద్రాస్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద వారిపై మోపిన నేరాల తీవ్రతను బట్టి, ఆ ఎనిమిదిమంది నిందితులూ తక్షణం జైలుకు చేరుకోవాలని ఆదేశించింది.
2022 సెప్టెంబర్‌లో పిఎఫ్ఐ సంస్థకు చెందిన ఎనిమిదిమంది వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలపై వారిని నిర్బంధించింది. ప్రత్యేక కోర్టు వారికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ మద్రాస్ హైకోర్ట్ మాత్రం బెయిల్ మంజూరు చేసింది. దానిపై ఎన్ఐఏ సుప్రీంకోర్టుకు వెళ్ళింది.
నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి నిధులు సేకరిస్తున్నారంటూ ఎన్ఐఏ ఆరోపించింది. ఆ విషయాన్ని నిరూపించగల ప్రత్యక్ష సాక్ష్యాధారాలు తగినన్ని లేవని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్ఐఏ నిందితుల నుంచి స్వాధీనపరచుకున్న డాక్యుమెంట్లు, ఆర్ఎస్ఎస్ వంటి హిందూసంస్థల నాయకుల్లో దాడులు చేయడానికి ఎంపిక చేసిన కొందరి చిత్రాలు కోర్టుకు అందజేసినప్పటికీ, ఆ నిందితులకు ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉందని నిరూపించడానిక ఆ ఆధారాలు చాలవని హైకోర్టు భావించింది.
హైకోర్టు తీర్పులో లోపాలున్నాయని, ఆరోపణల తీవ్రతను పట్టించుకోలేదనీ ఎన్ఐఏ వాదించింది. నిందితులు నిషిద్ధ పిఎఫ్ఐ సంస్థలోకి సభ్యులను రిక్రూట్ చేసుకున్నారనీ, వారికి ఉగ్రవాద కార్యకలాపాల శిక్షణ ఇచ్చారనీ, వారి సంసిద్ధతను పరీక్షించే మాస్ డ్రిల్స్ నిర్వహించారనీ ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది. ఆ చర్యలన్నీ ఇతర మతాల వారిలో భయాందోళనలు కలిగించి, 2047నాటికి భారత్‌ను షరియా పాలిత దేశంగా మార్చాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం అని ఎన్ఐఏ ఆధారసహితంగా వివరించింది.
జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిఠల్‌లతో కూడిన ధర్మాసనం ఎన్ఐఏ వాదనతో ఏకీభవించింది. ఎన్ఐఏ సమర్పించిన ఆధారాలను హైకోర్టు సరిగ్గా అంచనా వేయలేదని విమర్శించింది. హైకోర్టు భారీ తప్పు చేసిందని, ఏదైనా నేరం జరిగిందని చూపే ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని నిర్ధారించడం తప్పు అని సుప్రీంకోర్టు ధర్మాసనం దృఢంగా తేల్చిచెప్పింది. హైకోర్టు పరిశీలనలు లోపభూయిష్టంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించింది.
ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్, సమర్పించిన ఇతర సమాచారం సంతృప్తికరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నిందితులపై ఎన్ఐఏ చేసిన ఆరోపణలు కచ్చితంగా నిజమేనని విశ్వసించడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. నిందితులకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించే ఉపా చట్టం నిబంధనలు ఈ కేసులో పూర్తిగా వర్తిస్తాయని స్పష్టం చేసింది.