బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జులై 4న నిర్వహిస్తామని ప్రధానమంత్రి ఋషి శునక్ ప్రకటించారు. ఆమేరకు ప్రస్తుత పార్లమెంటు మే 30న రద్దవుతుందని బుధవారం వెల్లడించారు. పార్లమెంటు రద్దుకు బ్రిటన్ రాజు ఛార్లెస్‌ను ప్రధాని ఋషి శునక్ అనుమతి కోరగా, రాజు అంగీకరించారు. ఆ విషయం గురించి శునక్ లండన్‌లో వర్షం కురుస్తున్న వేళ 10 డౌనింగ్ స్ట్రీట్ మెట్ల మీద నిలబడి ప్రకటన చేయడం విశేషం. అంతేకాదు, బుధవారం రాత్రే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేసారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కింది. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అయితే పలు వివాదాలు, ప్రత్యేకించి కరోనా సమయంలో అధికార పక్షంలోని నేతలు పార్టీలు చేసుకోవడంపై చెలరేగిన వివాదం, బోరిస్ జాన్సన్ పదవికి ముప్పు తెచ్చాయి. ఎన్నికలను నివారించేందుకు కన్జర్వేటివ్ పార్టీ 2022లో మొదట లిజ్ ట్రస్‌ను ప్రధానిగా చేసింది. కానీ ఆమె ప్రభుత్వం 50 రోజులు కూడా నిలవలేకపోయింది. ఆ సమయంలో భారత సంతతికి చెందిన టోరీ పార్టీ ఎంపీ ఋషి శునక్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
ఋషి శునక్ ప్రభుత్వానికి 2025 జనవరి వరకూ సమయం ఉంది. ఇటీవల జరిగిన ఉపయెన్నికలు, స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ వరుసగా ఓటమిని చవిచూస్తూ వస్తోంది. ఈసారి ఎన్నికల్లో నాయకత్వ మార్పు తప్పదనీ, లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసాయి.
నిజానికి బుధవారం మధ్యాహ్నం బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ శునక్ ఇంగ్లండ్ సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటాయని చెప్పారు. ఆ జవాబిచ్చిన కొద్దిసేపటికే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దానికోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం తమ పర్యటనల షెడ్యూళ్ళను మార్చుకుని స్వదేశానికి వెంటనే చేరుకున్నారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ఋషి శునక్ ఎన్నికల ప్రకటన చేసారు.