కాంగ్రెస్,సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలు పాక్‌కు సానుభూతిపరులు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, ఇండీ కూటమిని తూర్పార బట్టారు.
2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్, ఎస్పీలు , ప్రస్తుతం మళ్ళీ కలిసి ప్రచారం చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు ఉగ్రవాదం పేరుతో భారత్ ను బెదిరించిన పాకిస్తాన్ నేడు ఆహారధాన్యాల కోసం అల్లాడుతుందన్నారు. కానీ పాక్ సానుభూతిపరులైన ఎస్పీ, కాంగ్రెస్‌లు మాత్రం పాక్ పేరిట దేశాన్ని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
యూపీలోని స్రవస్ధిలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన మోదీ, విపక్ష ఇండీ కూటమికి మతతత్వం, జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయని విమర్శించారు. కేన్సర్ కంటే ప్రమాదకరమైన ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే దేశానికి చేటు చేస్తాయన్నారు. యూపీలోని వారసత్వ నేతల ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ఫ్లాప్ సినిమాతో అవే పాత క్యారెక్టర్లు ప్రజలను అలరించలేవని రాహుల్ , అఖిలేష్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.