తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2011 నుంచీ పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లూ చట్టవిరుద్ధమైనవి అంటూ కోల్కతా హైకోర్టు వాటన్నింటినీ రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయం, ఆ సర్టిఫికెట్లతో సంపాదించుకున్న ఉద్యోగాలపై ప్రభావం చూపదని ప్రకటించింది.
మమతా బెనర్జీ ప్రభుత్వం 2012లో చట్టం చేసి కొన్ని కులాలను ఓబీసీలుగా గుర్తించి వారికి రిజర్వేషన్ వర్తింపజేసింది. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసింది. అయితే 2010కి ముందు రాష్ట్రప్రభుత్వం వర్గీకరించిన 66 కులాలకు ఈ ఉత్తర్వులు వర్తించబోవని జస్టిస్ తపబ్రత చక్రబొర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కులాలకు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ ఏదీ దాఖలు కానందున వాటికి ఈ ఆదేశాలు వర్తించవని వివరించింది.
తృణమూల్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను తప్పుపట్టింది. తపశీలి కులానికి రిజర్వేషన్లు తొలగించే ఈ ఆదేశాలను ఆమోదించబోమని మమతా బెనర్జీ చెప్పారు. ‘‘బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుంది. మా ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి ఆ బిల్లును తయారుచేసింది. ఆ బిల్లును క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదించాయి. అయితే కేంద్రసంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ రిజర్వేషన్లను నిలిపివేయడానికి బీజేపీ కుట్ర పన్నింది’’ అని ఆమె ఆరోపించారు.