మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు, ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు గుంటూరు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసుల బృందాలు ఇప్పటికే అరెస్టు వారెంటుతో సహా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఎమ్మెల్యే కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేసి లుకౌట్ నోటీసు జారీ చేశారు. నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది.
ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనలతో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.