ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాడి చేసిన కేసులో అరవింద్ కేజ్రీవాల్ అడ్డంగా ఇరుక్కున్నారు. ఆమె బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు తప్పుడువని, ఆప్ నేత ఉద్దేశపూర్వకంగానే ఆమెపై దాడి చేయించారనీ సీనియర్ న్యాయవాది, బీజేపీ నేత మహేష్ జెఠ్మలానీ వివరించారు. ఆయన వివరణ ఇలా ఉంది…
స్వాతీ మాలీవాల్ తనసై బిభవ్‌కుమార్ దాడి చేసారంటూ ఫిర్యాదు చేసారు. ఆమె రాజకీయ దురుద్దేశాలతోనే తమ పార్టీపై, పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కేజ్రీవాల్ కొట్టిపడేసారు. ఆ వివాదం నుంచి తప్పించుకోడానికి కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలను బిభవ్ చర్యలు పూర్వపక్షం చేసాయి.
స్వాతీ మాలీవాల్ చేసిన ఫిర్యాదులోని నిజానిజాలను బైటపెట్టగల సాక్ష్యాలను బిభవ్ కుమార్ ధ్వంసం చేసారు. దాన్నిబట్టే ఆమె ఆరోపణలు నిజమని అర్ధమవుతోంది. సీసీటీవీలో ఆనాటి దృశ్యాలను రికార్డు అయినట్లే ఉంది. కానీ స్వాతీ మాలీవాల్ అక్కడ ఉన్నప్పటి దృశ్యాలు మాత్రమే రికార్డుల్లో లేవు. ఆమె రావడానికి ముందు, వెళ్ళిన తర్వాత దృశ్యాలన్నీ రికార్డుల్లో ఉన్నాయి. ఆమె వచ్చి అక్కడనుంచి వెళ్ళేంతవరకూ ఉన్న దృశ్యాలు మాత్రం లేవు. అంటే ఉద్దేశపూర్వకంగానూ, ప్రయత్నపూర్వకంగానే స్వాతి ఉన్న దృశ్యాలను ఎంపిక చేసి మరీ తొలగించారని స్పష్టమవుతోంది.
అంతేకాదు, మాలీవాల్ వాదనకు బలం చేకూర్చేది, కేజ్రీవాల్ వాదన తప్పని తేల్చేదీ మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైకి తరలించిన వెంటనే బిభవ్‌కుమార్ తన మొబైల్ ఫోన్‌ను ఫార్మేట్ చేసేసారు. దానివల్ల బిభవ్ ఫోన్‌లోని డాటా మొత్తం చెరిగిపోయింది. దాన్ని మళ్ళీ రికవరీ చేస్తే ఫిర్యాదులోని నిజానిజాలు బైటపడడమే కాకుండా, ఆ నేరాల్లో కేజ్రీవాల్ ప్రమేయం గురించిన ఆధారాలు కూడా దొరికే అవకాశముంది. అంతేకాదు… లిక్కర్ పాలసీ స్కాం, ఎఫ్‌సీఆర్ఏ ఉల్లంఘనలు, ఖలిస్తానీ ఉగ్రవాద శక్తులతో సంబంధాలు వంటి విషయాల్లోనూ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా విస్తృత సమాచారం దొరకవచ్చు.
అసలు సిసిటివి ఫుటేజ్ డిలీట్ చేయడం అన్నదే పెద్దనేరం. కేజ్రీవాల్, అతని సన్నిహితులు పాల్పడిన పలు నేరాలు ఆ ఫుటేజ్‌లో ఉండే అవకాశాలు ఎక్కువ అన్న అనుమానాలు తలెత్తుతాయి. సిసిటివి దృశ్యాలు, మొబైల్ డేటా రెండింటినీ రికవర్ చేయడం సాధ్యమని తెలుస్తోంది. అలా, స్వాతీ మాలీవాల్‌పై దాడి రాబోయే రోజుల్లో కేజ్రీవాల్, అతని సహచరులకు అతిపెద్ద తలనొప్పిగా మారబోతోంది.