కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌సింగ్ అలియాస్ అర్ష్ దలా, అతని ముగ్గురు అనుచరుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది.
కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’ ఉగ్రవాది అర్ష్ దలాతో పాటు భారతదేశంలో అతని ఏజెంట్లు హర్జీత్ సింగ్ అలియాస్ హ్యారీ మౌర్, రవీందర్‌సింగ్ అలియాస్ రజ్వీందర్సింగ్ అలియాస్ హ్యారీ రాజ్‌పురా, రాజీవ్‌కుమార్ అలియాస్ షీలా… మొత్తం నలుగురి మీద న్యూఢిల్లీలోని ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఎ సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.
పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో దలా నిర్వహిస్తున్న స్లీపర్ సెల్స్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా ఎన్ఐఎ పనిచేస్తోంది. అందులో భాగంగా టెర్రర్ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ను నడిపిస్తున్న ముగ్గురు కీలక వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో వెల్లడించిన విషయాల ప్రకారం… హ్యారీ మౌర్, హ్యారీ రాజ్‌పురా స్లీపర్‌సెల్స్‌గా పనిచేస్తున్నారు. రాజీవ్‌కుమార్ వారికి ఆశ్రయం కల్పించాడు. వారు ముగ్గురూ కలిసి దలా మార్గదర్శకత్వంలో దేశంలో ఉగ్రవాద దాడులు జరపడానికి ప్రణాళికలు రచించారు. వాటికి కావలసిన నిధులను దలా అందజేసాడు. హత్యలకు కావలసిన ఆయుధాలను, ప్రయాణాలకు అవసరమైన వాహనాలను సమకూర్చే పని రాజీవ్‌కుమార్ చూసుకుంటాడు. తాము ఎంచుకున్న వ్యక్తులను కాల్చి చంపడానికి హ్యారీ మౌర్, హ్యారీ రాజ్‌పురా షూటర్స్‌గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత వారిని సురక్షితంగా రహస్యంగా దాచి ఉంచడానికి కావలసిన ఏర్పాట్లు రాజీవ్‌కుమార్ చేస్తాడు.
హ్యారీ మౌర్, హ్యారీ రాజ్‌పురా ఇద్దరినీ ఎన్ఐఎ అధికారులు 2023 నవంబర్ 23న అరెస్ట్ చేసారు. రాజీవ్‌కుమార్‌ను 2024 జనవరి 12న అరెస్ట్ చేసారు. ఈ ఉగ్రవాదుల సిండికేట్ మొత్తాన్నీ ధ్వంసం చేయడానికి తమ దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఎ వెల్లడించింది.