హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణంతో ఖాళీ అయిన ఇరాన్ అధ్యక్ష పదవికి జూన్ 28న ఎన్నికలు జరుగుతాయి. ఇరాన్ ప్రభుత్వంలోని మూడు ప్రధాన విభాగాల అధినేతలు ఆ ఎన్నిక తేదీని నిర్ణయించారు.
ఇరాన్ ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగం అధినేత మహమ్మద్ మొఖ్బీర్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్, న్యాయవ్యవస్థ అధినేత గులామ్ హుసేన్ మొహ్సేనీ అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు. ఆ భేటీలో జూన్ 28న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే లేదా మరేదైనా విధంగా ఆ పదవిలో కొనసాగలేకపోతే, ఆ రోజు నుంచి 50 రోజులలోగా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపడానికి ముగ్గురు అధినేతలూ కలిసి ఏర్పాటు చేయాలి.
ఎన్నికలకు టైంటేబుల్ కూడా సిద్ధమైంది. అధ్యక్ష పదవికి పోటీపడదలచుకున్నవారు మే 30 నుంచి జూన్ 3లోగా రిజిస్టర్ చేసుకోవాలి. జూన్ 12 నుంచి 15 రోజుల వరకూ వారు ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత జూన్ 28న ఎన్నికలు జరుగుతాయి.
ఆదివారం అజర్బైజాన్లోని తబ్రిజ్ సమీపంలో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇరాన్ విదేశాంగమంత్రి హుసేన్ అమీర్ అబ్దొల్లాహియా, మరో ఇద్దరు సీనియర్ అధికారులు మరణించారు. ఆ తరువాత ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.