తెలంగాణలోని కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్, ఎఐఎంఐఎం నగరశాఖ అధ్యక్షుడు అబ్బాస్ సమీని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ విశ్వహిందూపరిషత్ కరీంనగర్ విభాగం డిమాండ్ చేస్తోంది. అబ్బాస్ సమీ మే 14 నుంచి పరారీలో ఉన్నారు. భరత్ అనే హిందూ యువకుడిపై దాడి చేసిన కేసులో అతను నిందితుడు.
విహెచ్పి కరీంనగర్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ చెప్పిన వివరాల ప్రకారం… స్థానిక కళాశాలల్లో చదువుకునే హిందూ అబ్బాయిలను బెదిరించడం, వారిపై దాడులు చేయడం అబ్బాస్ సమీకి అలవాటు. సహ విద్యార్థులైన ముస్లిం అమ్మాయిలతో మాట్లాడితే చాలు, హిందూ యువకులపై దాడులు చేసిన చరిత్ర అతనిది. నగరంలో ఎన్నో మతఘర్షణలకు, ఉద్రిక్త పరిస్థితులకూ కారణంగా నిలిచాడు.
కొద్దిరోజుల క్రితం భరత్ అనే ఒక హిందూ దళిత యువకుడి మోటర్ సైకిల్ మీద ఒక ముస్లిం అమ్మాయి వెడుతుండగా వారిని సమీ గ్యాంగ్ అడ్డగించింది. వారు భరత్‌ను చితకబాదారు. కులం పేరుతో తిట్టారు. ముస్లిం అమ్మాయితో సంబంధం పెట్టుకుంటావా అంటూ దూషించారు.
‘‘మాకు అందిన సమాచారం ప్రకారం అబ్బాస్ సమీ ఇప్పుడు హైదరాబాద్‌లోని ఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో తలదాచుకున్నాడు. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అతన్ని రక్షిస్తున్నాడు’’ అని కరీంనగర్ బజరంగ్దళ్ జోనల్ కన్వీనర్ ప్రదీప్ చెప్పారు.
నగరంలో మతసామరస్యాన్ని, శాంతిభద్రతలనూ కాపాడడానికి అబ్దుల్ సమీని తక్షణమే అరెస్ట్ చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ డిమాండ్ చేసాయి.