ఐదవ దశ లోక్‌సభ పోలింగ్‌లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం బారాముల్లా. అక్కడ పోలింగ్‌తో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు ఎంపీ స్థానాలకూ పోలింగ్ పూర్తయినట్లే. బారాముల్లాలో దాదాపు 60శాతం పోలింగ్ నమోదవడం విశేషం. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.
సాధారణంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువ ఉండే బారాముల్లాలో పోలింగ్ శాతం తక్కువగా ఉండేది. 1984లో నమోదైన 61.09శాతమే ఇప్పటివరకూ అత్యధిక పోలింగ్ శాతం. బారాముల్లాలో 1996లో 47శాతం పోలింగ్ జరిగితే 1998లో 42శాతానికి తగ్గింది. 1999లో 28శాతానికి పడిపోయింది. 2004లో 36శాతం, 2009లో 42శాతం, 2014లో 39శాతం, 2019లో 35శాతం పోలింగ్ నమోదయింది. అలాంటి చోట ఈసారి మంగళవారం ఉదయానికి 58.17శాతం పోలింగ్ నమోదయింది. తుది పోలింగ్ శాతం ఒకట్రెండు రోజుల్లో తెలియవచ్చు. 1984 తర్వాత ఈస్థాయిలో పోలింగ్ జరగడం బారాముల్లాలో ఇదే మొదటిసారి.
బారాముల్లా నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి సజ్జాద్ లోన్, పీడీపీ అభ్యర్ధిగా మొహమ్మద్ ఫయాజ్ మిర్, స్వతంత్ర అభ్యర్ధిగా తిహార్ జైల్లో బందీగా ఉన్న ఇంజనీర్ రషీద్ పోటీ చేస్తున్నారు. అక్కడ బీజేపీ పోటీ చేయలేదు. బారాముల్లాలో భారీ పోలింగ్ నమోదవడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు.
లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒకే ఒక లోక్‌సభ స్థానానికి 67శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. అక్కడ ముగ్గురే అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. లద్దాఖ్ నియోజకవర్గం, విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద స్థానం. 2019 ఎన్నికల్లో లద్దాఖ్‌లో 71శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అక్కడ బీజేపీ అభ్యర్ధిగా తాషీ గ్యాల్సన్, కాంగ్రెస్ అభ్యర్థిగా సెరింగ్ నామ్‌గ్యాల్, స్వతంత్ర అభ్యర్ధిగా మొహమ్మద్ హనీఫా జాన్ బరిలో ఉన్నారు.
నాలుగో దశలో అంటే మే 13న శ్రీనగర్ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. అక్కడ 37.99శాతం పోలింగ్ నమోదయింది. శ్రీనగర్‌లో సుమారు నాలుగు దశాబ్దాల్లో అంత పోలింగ్ శాతం నమోదవడం ఇదే మొదటిసారి.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం