చెప్పుల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం జరిపిన సోదాల్లో రూ. 57 కోట్లు లెక్కల్లో చూపని నగదు వెలుగు చూసింది. చెప్పుల వ్యాపారుల వద్ద పోగుబడ్డ డబ్బు చూసి ఐటీ అధికారులే నివ్వెరపోయారు. ఆ వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చెప్పుల వ్యాపాల ఇళ్లు, కార్యాలయాలు, గెస్ట్ హౌసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించిన ఫిర్యాదులు అందడంతో ఐటీ అధికారులు శనివారం నుంచి సోదాలు ప్రారంభించారు. ఇవాళ సాయంత్రానికి సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది.