ఛత్తీస్గఢ్ లో ఘోరం జరిగింది. వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కవార్ధా ప్రాంత పరిధిలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది.
ప్రమాద సమయంలో వాహనంలో 35 నుంచి 45 మంది వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవ పంచనామా కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బైగా గిరిజన తెగకు చెందిన వారు బీడీ ఆకు సేకరణ కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.