మహారాష్ట్ర పుణేలో శనివారం రాత్రి ఓ 17ఏళ్ళ కుర్రాడు బాగా తాగి విలాసవంతమైన కారును ప్రమాదకరంగా డ్రైవ్ చేసి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాడు. చిత్రమేంటంటే, అరెస్ట్ అయిన 15 గంటల్లోనే అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్‌కు విధించిన షరతులు వింటే నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి. ఆ నిందితుడు పుణేలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు.
తాగిన మత్తులో ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన మైనర్‌కు బెయిల్ మంజూరు చేయడానికి పుణే కోర్టు విధించిన షరతులు ఏంటో తెలుసా… యెరవాడలో 15రోజులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయడం, రహదారి ప్రమాదాలపై వ్యాసం రాయడం, మద్యపానానికి చికిత్స తీసుకోవడం, కౌన్సిలింగ్ సెషన్లకు హాజరవడం. అంత కష్టమైన షరతులు పెట్టి, ఇంటికివెళ్ళి పడుకోమంటూ ఆ పసిబాలుడికి బెయిల్ ఇచ్చేసింది పుణే స్పెషల్ కోర్టు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్లు అనీష్ అవైద్య, అశ్విని కోష్ట పుణేలో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి వారు మిత్రుల గెట్-టుగెదర్‌కు హాజరయ్యారు. ఆ కార్యక్రమం అయ్యేసరికి అర్ధరాత్రి దాటి 2గంటల వేళ అయింది. వారు మోటర్‌సైకిల్‌పై వెనుదిరిగి వెడుతుండగా వెనుకనుంచి పోర్షే కారు వచ్చి వారిని గుద్దేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ సమయంలో ఆ కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెడుతోంది. దానికి కనీసం నెంబర్‌ప్లేట్ కూడా లేదు. అంత వేగంతో కారు ఢీకొట్టడంతో అశ్విని 20 అడుగులు గాల్లో ఎగిరి నేలమీద దబ్బున పడింది. అనీష్ ఆ దగ్గరలో పార్క్ చేసిఉన్న మరో కారు దగ్గర పడ్డాడు. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
‘‘ప్రమాదం సుమారు 2.15 గంటల సమయంలో జరిగింది. కారు డ్రైవర్ ఆ ప్రమాదం తర్వాత పారిపోడానికి ప్రయత్నించాడు. కానీ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అవడంతో దారి కనిపించలేదు. స్థానికులు అతన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో కారులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో ఒకతను పారిపోయాడు. మిగతా ఇద్దరినీ స్థానికులు చితకబాదారు. ప్రమాదం జరిగిన 15నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు’’ అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ప్రమాదం చేసిన యువకుడు ఇటీవలే 12వ తరగతి పాస్ అయ్యాడు. ఆ సందర్భంలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోడానికి పబ్‌కు వచ్చాడు. అక్కడ వారు మద్యం సేవించారు. అతనికి మరో 4నెలల్లో 18ఏళ్ళ వయసు వస్తుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే వయసు కూడా ఇంకా రాలేదు. మృతుల స్నేహితుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారు.
ఈ ప్రమాదానికి కారణమైన నిందితుణ్ణి మైనర్‌గా కాక వయోజనుడిగానే పరిగణించాలని పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసారు. నిందితుణ్ణి తమ కస్టడీకి ఇమ్మని కోరారు. ఇప్పుడతనికి బెయిల్ మంజూరు చేయడంపై సెషన్స్ కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. మైనారిటీ తీరని పిల్లవాడికి పబ్‌కి వెళ్ళి మందుకొట్టడానికి నెంబర్‌ప్లేట్ లేని కార్ ఇచ్చి డ్రైవింగ్ చేయనిచ్చిన అతని తండ్రి మీద, అలాగే మైనర్‌కి మద్యం విక్రయించిన పబ్ మీద కూడా కేసు పెడతామని కమిషనర్ చెప్పారు.
ఈ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు విధించిన షరతులు అందరికీ మతిపోగొట్టాయి. అసలు కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ సామాజికమాధ్యమాల్లో ప్రజలు స్పందిస్తున్నారు.