ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక
ఏపీలో ఎన్నికలకు ముందు, తరవాత జరిగిన హింసపై విచారణ జరిపిన సిట్ తన నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తాకు అందించింది. రెండు రోజులపాటు మూడు జిల్లాల్లో సిట్ అధికారులు పర్యటించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించిన సిట్, 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల మార్పుపై నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కొత్తగా మరికొంత మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని నివేదికలో సూచించినట్లు సమాచారం అందుతోంది.
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసినా కొందరు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కొందరు రాజకీయ నేతలతో కుమ్మక్కైనట్లు ప్రాథమిక నివేదికలో పొందుపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ అధికారులు రెండు రోజుల పాటు పర్యటించి నివేదికను తయారు చేశారు. సిట్ నివేదికను డీజీపీతోపాటు, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి అందజేయనున్నారు.