పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నెగ్గారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి జరిగిన బలనిరూపణలో ప్రచండ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 క్లాజ్ 2 ప్రకారం 69 ఏళ్ళ ప్రధాని విశ్వాస పరీక్షలో పాల్గొని విజయం సాధించారు.
కూటమి సర్కారు నుంచి జనతా సమాజ్‌వాదీ పార్టీ వైదొలగడంతో ప్రచండ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. హోంమంత్రి రాబి లబిచానేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు. కోఆపరేటివ్ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కూటమి సర్కారులో చీలికలు ఏర్పడినప్పుడు ప్రధాని 30 రోజుల వ్యవధిలో విశ్వాస పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రచండ నాలుగు సార్లు బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
275 మంది ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 138 ఓట్లు అనుకూలంగా పోల్ కావాల్సి ఉండగా, 157 ఓట్లు పడ్డాయి. నేపాలీ కాంగ్రెస్ ఓటింగ్‌ను బహిష్కరించింది.