ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో వారి స్థానంలో కొత్త నియామకాలను చేపట్టింది.
డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు ను నియమించగా, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో టెన్షన్ పెరుగుతోంది. ఈసీకి నిఘా వర్గాల నుంచి కీలక నివేదిక అందింది. కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురం, కాకినాడ నగరంలో హింస చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఓట్ల లెక్కింపునకు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది.
ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లోనూ, ఇటీవలి పోలింగ్ సందర్భంగా గొడవలకు దిగిన, ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసులు నిఘా పెంచారు.
పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో లెక్కింపు రోజున ఇక్కడ కూడా పటిష్ఠమైన భద్రత కల్పించే దిశగా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ స్థానంలో వైసీపీ తరఫున వంగా గీత పోటీ లో ఉన్నారు.