కజికిస్థాన్‌లో భారత విద్యార్థులపై గత వారం రోజులుగా జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కజికిస్థాన్‌లోని స్థానిక విద్యార్థులు, భారతీయ విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు. భారత్ నుంచి 15 వేల మంది విద్యార్థులు కజికిస్థాన్‌లోని పలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు నివాసం ఉండే హాస్టళ్లు, హోటళ్లు, నివాసాలను గుర్తించి కర్రలు, రాడ్లతో దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
కొందరు తుపాకీలతో కూడా బెదిరిస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కజికిస్థాన్‌లో 2 వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వారిపై కూడా దాడులు జరుగుతున్నాయి. కజికిస్థాన్‌లో భారతీయులపై జరుగుతోన్న దాడులకు భారత్ స్పందించింది. అక్కడ ఎంబసీ అధికారులు కజికిస్థాన్ ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నివాసం ఉండే గదులను వదలి బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోందని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు.