14 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బొగ్గు ఫర్నేస్‌లో పడవేసి కాల్చిచంపేసిన ఘటన 2023 ఆగస్టు 3న రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటు చేసుకుంది. ఆ సంఘటనలో నేరస్తులుగా నిరూపణ అయిన ఇద్దరికి ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి అనిల్ గుప్తా దీన్ని అత్యంత అరుదైన కేసుగా నిర్ణయించి తుదితీర్పు ఇచ్చారు. ఈ కేసులో కాలూ, కాన్హా అనే ఇద్దరు అన్నాదమ్ములు నేరస్తులు అని న్యాయస్థానం మొన్న శనివారం నాడు నిర్ధారణ చేసింది. అదే కేసులో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు నిందితులను మాత్రం వదిలిపెట్టేసింది. కేసులో ఆధారాలు ధ్వంసం చేసారంటూ వారిపై చేసిన ఆరోపణలను కోర్టు త్రోసిపుచ్చింది.
బాధితురాలి కుటుంబం ఈ కేసులో నిందితులను ప్రత్యేక కోర్టు విడిచిపెట్టడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నారు.
నిందిత మహిళల్లో ఇద్దరు, నేరం నిరూపణ అయిన కాలూ, కాన్హాల భార్యలు. కాలూ, కాన్హాలకు న్యాయస్థానం మరణ శిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ మహావీర్‌సింగ్ కిష్ణావత్ వెల్లడించారు.
గత ఏడాది ఆగస్టు రాజస్థాన్ భిల్వారా జిల్లా కోట్రీ తెహసీల్‌లోని షాపురా ప్రాంతంలో బాలిక తమ ఆవులమంద కాస్తున్న సమయంలో దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అదేరోజు రాత్రి వాన పడుతున్నా లెక్కచేయకుండా మృతురాలి దేహాన్ని బొగ్గు ఫర్నేస్‌లో వేసి తగలబెట్టేసారు. ఆ దేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించి ఆ బాలికను సజీవదహనం చేసిన సంగతి తెలుసుకున్నారు.