డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కొత్త విధానానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జూన్ 1 నుంచి ప్రైవేటు సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ జారీ చేస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో భారీ మార్పులు చేసిన కేంద్రం, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీకి అనుమతించిన కేంద్రప్రభుత్వం అందుకు కొన్ని షరతులు విధించింది. డ్రైవింగ్ స్కూల్ సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం మూడు ఎకరాల భూమి ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు రాకపోకలకు అంతరాయం ఉండకూడదు. శిక్షణ ఇచ్చే వ్యక్తులు హైస్కూలు విద్యను పూర్తి చేయాలి. డ్రైవింగ్‌లో ఐదేళ్ళ అనుభవం ఉండటంతో పాటు బయోమెట్రిక్స్, టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
లైట్ వెహికల్ ట్రైనింగ్‌ను కచ్చితంగా 4 వారాల్లో పూర్తిచేయాల్సి ఉండగా కనీసం 29 గంటల శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. థియరీ, ప్రాక్టికల్ రూపంలో శిక్షణ ఉండాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్‌కు ఆరువారాలపాటు కనీసం 39 గంటల శిక్షణ అవసరమని పేర్కొంది.
లెర్నర్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్ రెన్యువల్, పర్మెనెంట్ లైసెన్స్ రూ. 200 కాగా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఫీజు రూ. 1000 గా నిర్ణయించారు.