తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు రిజిస్టర్ చేసారు.
ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ జి శ్రీనివాస్ కథనం ప్రకారం… అబ్దుల్ అతీక్ అనే వ్యక్తి 2017లో జాస్మిన్ అనే యువతిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఇద్దరమ్మాయిలు పుట్టారు. గత రెండేళ్ళుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2023లో జాస్మిన్ తన భర్త అబ్దుల్ అతీక్ మీద వేధింపుల కేసు పెట్టింది. ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలంటూ ఆమె కోర్టుకెక్కింది.
కేసును విచారించిన న్యాయస్థానం, ఆమెకు నెలనెలా రూ.7200 ఇవ్వాలని అతీక్‌ను ఆదేశించింది. అయితే అతను ఆమెకు పైసా కూడా ఇవ్వనంటూ తేల్చి చెప్పేసాడు. జాస్మిన్ మళ్ళీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు అతీక్‌కు తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీచేసింది. ఆ నేపథ్యంలో అబ్దుల్ అతీక్ జాస్మిన్‌కు మూడుసార్లు తలాక్ అని వాట్సాప్ సందేశం పంపించాడు. ఆ వ్యవహారంలో ఆదిలాబాద్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసారు. నిందితుణ్ణి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.
భారత పార్లమెంటు 2019 జులైలో చేసిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్ చెబుతూ తక్షణం విడాకులు ఇవ్వడం శిక్షార్హమైన నేరం. ట్రిపుల్ తలాక్ లేదా మార్చడానికి వీలులేని తలాక్ ఇచ్చే నేరానికి మూడేళ్ళ జైలుశిక్ష పడే అవకాశముంది. బాధిత మహిళకు, ఆమెపై ఆధారపడిన పిల్లలకు భరణం పొందే హక్కు కూడా ఉంది. 2017లో భారత సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.